వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్య ఆందోళన: అలుముకుంటున్న అంధకారం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంతో రాష్ట్రంలో అంధకారం అలుముకనే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలోకి దిగడంతో తీవ్రమైన విద్యుత్తు సంక్షోభం తలెత్తింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ప్రధాన పట్టణాల నుంచి పల్లెల దాకా విద్యుత్తు లేక చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆదివారం రాత్రి జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా, దాదాపు సగం సీమాంధ్ర చీకట్లోనే ఉంది. తిరుమళ శ్రీవారికి సైతం ఆరు గంటలపాటు కరెంట్ కష్టాలు తప్పలేదు. రాజధాని నగరం హైదరాబాద్‌లోనూ ఆదివారం కూడా విద్యుత్ కోతలు కొనసాగాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్రలోని ప్రధాన ప్లాంట్లలో విద్యుదుత్పత్తి ఆగిపోయింది. విజయవాడలోని వీటీపీఎస్ (ఎన్టీపిఎస్), కడప జిల్లాలోని ఆర్టీపీపీ, కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సింహాద్రి ఎన్టీపీసీ యూనిట్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. మొత్తంగా 4370 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం ఉదయానికి ఉత్పత్తి మరింత పడిపోయే ప్రమాదముంది. వీటీపీఎస్‌లో ఆదివారం ఉదయం నుంచే ఆరు యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. ఏడో యూనిట్ ద్వారా 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Power crisis mounts with United Andhra agitation

బొగ్గు నిల్వలు అయిపోవడం పడిపోవడం, మూడు అడుగుల మేరకు బూడిద పేరుకుపోవడంతో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఏడో యూనిట్‌ను కూడా నిలిపివేశారు. దీంతో వీటీపీఎస్‌లో మొత్తం 1260 మెగావాట్ల ఉత్పత్తి ఆగిపోయింది. పరిస్థితి మరింత తీవ్రమైతే హైటెన్షన్ పరిధిలోని పరిశ్రమలు, ముఖ్యంగా పాలు, నీళ్లు, ఆసుపత్రులు వంటి అత్యవసర సర్వీసులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

మీడియా కథనాల ప్రకారం - శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్కేంద్రంలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సుమారు 200 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. 110 మెగా వాట్ల చొప్పున సామర్థ్యం ఏడు జనరేటర్లను నిలిపివేశారు. ఈ విద్యుత్ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న గ్రిడ్ ద్వారా 220 కేవీ స్విచ్‌యార్డు నుంచి ఆరు జిల్లాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఇప్పుడు ఉత్పత్తి నిలిచిపోవడంతో స్విచ్‌యార్డు పరిధిలోని కర్నూలు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని 1050 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో రెండో రోజు కూడా ఉత్పత్తి ఆగిపోయింది. ఉద్యోగులు, కార్మికులు ఆదివారం ఉదయం మెయిన్‌గేట్ల వద్ద బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. వేలాది మంది ఉద్యోగులు ఆర్టీపీపీ మెయిన్ గేటు వద్ద నుంచి కాలనీ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు.

సీమాంధ్రలోని 13 జిల్లాల్లో దాదాపు 1,500 గ్రామాలను అంధకారం చుట్టుముట్టింది. హైదరాబాదు, విజయవాడ నగరాలు విద్యుత్ కోతను ఎదుర్కుంటున్నాయి.

English summary
More than 1,500 villages in 13 districts of Seemandhra plunged into darkness on Sunday with major cities like Hyderabad and Vijaywada too witnessing power cuts. The crisis triggered by the agitation against the bifurcation of Andhra Pradesh looked set to intensify after electricity employees announced a change in their 48-hour strike: they're now on an indefinite protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X