గల్లా జయదేవ్, ఆది: మహేష్ బాబు ఫిక్స్?
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబుకు రాజకీయ చిక్కులు తప్పేట్లు లేవు. 1 నేనెక్కొడినే సినిమా ద్వారా తాజాగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన మహేష్ బాబు రాజకీయాల్లో వేలు పెడుతారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తన బావ గల్లా జయదేవ్, బాబాయి ఆదిశేషగిరిరావు తెలుగుదేశం పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మహేష్ బాబు వీరి కోసం ప్రచారం చేపట్టక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి.
అయితే ఇద్దరు కూడా గుంటూరు పార్లమెంటు సీటునే ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి మహేష్‌బాబు బావ గల్లా జయదేవ్ పేరును తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే బాబాయి ఆదిశేషగిరిరావు రంగంలో దిగి తనకూ సీటు కావాలని అడగడంతో వివాదం ప్రారంభమైంది. ఇద్దరిలో ఎవరైనా ఫరవా లేదు, మీరే ఒక అంగీకారానికి రావాలని చంద్రబాబు వారికి చెప్పినట్లు సమాచారం.

దాంతో వివాదాన్ని పరిష్కరించే బాధ్యత మహేష్ బాబు తండ్రి, నటశేఖర కృష్ణ భుజస్కంధాలపై పడినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన జయదేవ్ స్థానికేతరుడు కావడం వల్ల అతనికి వ్యతిరేకత ఉంటుందేమోననే అనుమానాన్ని పార్టీలోని ఒక వర్గం వ్యక్తం చేస్తున్నందున ఆ విషయంపై చర్చించిన కృష్ణ కుటుంబ సభ్యులు ఆదిశేషగిరిరావు అయితే స్థానికుడే అవుతారనే వాదన ప్రారంభించారని అంటున్నారు.
అయితే బావ జయదేవ్ రంగంలో దిగితే తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు పార్లమెంటు స్థానం వరకు ప్రచారం చేసేందుకు ఇప్పటికే మహేష్‌బాబు అంగీకరించారని అంటున్నారు. ఇప్పుడు తాజాగా బాబాయి రావడంతో ఆయన ఎటు చెప్పాలో అర్ధం కాని పరిస్థితుల్లో చిక్కుకున్నారని అంటున్నారు. ఆదిశేషగిరి రావుకైనా తాను ప్రచారం చేస్తానని మహేష్ బాబు చెప్పారని అంటున్నారు.
జయదేవ్ ఇప్పటికే గుంటూరు పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం ప్రారంభించి ఉండటంతో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆదిశేషగిరిరావుపై పడిందని అంటున్నారు. జయదేవ్‌కు ఏ మాత్రం అవకాశం తప్పినా తనకు ఇవ్వాలని ఆదిశేషగిరిరావు మధ్యేమార్గంగా చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, ఆదిశేషగిరిరావుకు తెనాలి అసెంబ్లీ స్థానం కేటాయించి జయదేవ్‌కు గుంటూరు పార్లమెంటు స్థానం కేటాయిస్తారని అనుకుంటున్నారు. ఆ ఇద్దరికి కూడా మహేష్ బాబు ప్రచారం సాగించవచ్చునని, దానివల్ల తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications