డీల్, కిరణ్‌కు ప్రశంస చిచ్చు: సబ్బంపై జగన్ కన్నెర్ర!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరిపై కన్నెర్ర చేశారు! యూపిఏ3కి మద్దతిస్తామని జగన్ గతంలోనే ప్రకటించారని చెప్పడమే కాకుండా సమైక్యవాణి బలంగా వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సబ్బం హరి పొగడటంతో ఆయనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోందంటున్నారు.
సబ్బంకు తమ పార్టీలో సభ్యత్వం లేదని, ఆయనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి ఆదివారం మరోసారి చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో జగన్ బాధపడ్డారని తెలిపారు. తద్వారా సబ్బం హరికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలుపులు మూసేసింది! రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉంటుందన్నట్లుగా సబ్బం వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పటికే రెండు పార్టీల ఒప్పందం కుదిరిందన్న ప్రచారానికి బలం చేకూరేలా ఉండటంతో ఆయనతో తమకు సంబంధం లేదని జగన్ పార్టీ తేల్చి చెప్పింది.

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత జగన్‌కు అండగా నిలిచి, అందరికంటే ముందు పదవులు సైతం వదులుకున్న కొండా సురేఖను నిర్లక్ష్యం చేసినట్లుగానే ఇప్పుడు సబ్బం హరికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలుపులు మూసేసిందంటున్నారు. ఓదార్పు యాత్ర నుంచి జగన్ జైలుకు వెళ్లేదాకా సబ్బం హరి ఆయనతో ఉన్నారు. జగన్‌ను జైలులో మొట్టమొదటిసారి పరామర్శించిన ముఖ్య నాయకుడు సబ్బం.
ఇటీవల జైలు నుంచి విడదలయ్యేముందు జగన్‌తో చివరి ములాఖత్ ఆయనదే. లోక్‌సభలో ఇద్దరివీ పక్కపక్క సీట్లే. అలాంటి సబ్బం హరిని జగన్ పార్టీ ఒక్కసారిగా వదిలించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం ఓ టివి చానల్ నిర్వహించిన చర్చలో కొన్ని వ్యాఖ్యలు చేయడమే ఆయనపై ఆగ్రహానికి కారణమంటున్నారు.
జగన్ బిజెపితో పొత్తు కుదుర్చుకోరని, యూపిఏకే మద్దతు ఇస్తారని, ఇది గతంలో జగన్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇవి ఆ పార్టీని ఆగ్రహానికి గురి చేశాయి. అదే సమయంలో సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న కిరణ్‌ను అభినందించడం కూడా ఆ పార్టీ జీర్ణించుకోలేకపోయిందంటున్నారు. ఆదివారం శోభా నాగి రెడ్డి మాట్లాడుతూ.. ఆయన వస్తానన్నా తమ పార్టీలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పారు.












Click it and Unblock the Notifications