ఫలితాలు: మోడీ, యశోదాబెన్ రక్షణకు ఎస్పీజి!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆయన నుంచి విడిగా ఉంటున్న భార్య యశోదాబెన్‌కు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజి) రక్షణ కల్పించటానికి రంగం సిద్ధమయ్యింది. రాజీవ్ గాంధీ హత్య జరిగిన తరువాత కేంద్రం ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఈ ఎస్పీజీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని, మాజీ ప్రధాని, వారి కుటుంబ సభ్యులకు నియమ నిబంధనల ప్రకారం ఎస్పీజీ రక్షణ కల్పించాల్సి ఉంటుంది.
గుజరాత్ ముఖ్యమంత్రిగానే కాక ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి మోడీకి భద్రతను పెంచారు. 110 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జి) కమాండోలు ఆయన రక్షణకు నియమితులయ్యారు. ఎస్పీజీ రక్షణను ఇవ్వాలన్న బిజెపి డిమాండ్‌ను తిరస్కరించిన హోమ్ శాఖ ఇటీవలే ఎన్‌ఎస్‌జి కమాండోలను నియమించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టంకాగానే మోడీ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ స్వీకరిస్తుంది.

ప్రధానితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఎస్పీజీ రక్షణను విస్తరింప చేయాలన్న నిబంధన కింద మోడీ భార్య యశోదాబెన్‌కు కూడా ఎస్పీజి భద్రత కల్పిస్తారు. యశోదాబెన్ బనస్కాంత జిల్లాలోని ఓ గ్రామంలో తన తల్లితో కలిసి ఉంటున్నారు. ఇప్పుడామె ఉంటున్న ఇల్లు ఎస్పీజీ సిబ్బంది ఉండటానికి కూడా సరిపోదు కాబట్టి ఆమె నివాస గృహాన్ని మార్చక తప్పదని భద్రతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆమె అంగీకరిస్తే గాంధీనగర్‌కు మకాం మార్చి ఒక ప్రభుత్వ క్వార్టర్‌లో వసతిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అంతేగాక గాంధీనగర్‌లో ఉంటున్న నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌కు కూడా ఎస్పీజి రక్షణ కల్పిస్తారని తెలుస్తోంది. బిజెపి విజయం సాధిస్తే నరేంద్ర మోడీకి రాష్టప్రతి నుంచి ఆహ్వానం అందేదాకా కూడా ఆగకుండా ఎస్పీజి ఒక అడ్వాన్స్ టీమ్‌ను ఆయన రక్షణ కోసం పంపిస్తుందని ఓ అధికారి తెలిపారు. కాగా, దీనిపై సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఎస్పీజి చీఫ్ దుర్గాప్రసాద్ అందుబాటులో లేరు. మరోవైపు మోడీకి రక్షణపై ఎస్పీజి ముందస్తు కసరత్తు పూర్తిచేయడం సాధారణమేనని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం ఉదయం 10.30గంటల వరకు వెలుడిన ఫలితాల ప్రకారం ఎన్డీఏ కూటమి 306 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 71 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 151 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications