ఉద్యోగుల్లో జగన్ చిచ్చు: ధర్నాకు విజయమ్మ?
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య నినాదంతో ఆందోళనకు దిగిన సీమాంధ్ర ఉద్యోగుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా విభేదాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమైక్య నినాదం తీసుకున్న ఏకైక పార్టీగా రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగుల్లో ఒక వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గుర్తిస్తుండగా, మరో వర్గం దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
వైయస్ జగన్ జైలు నుంచి విడుదల కావడం వల్ల సమైక్యాంధ్ర ఉద్యమానికి ఓ ఊపు వస్తుందని భావించేవారు చాలా మందే ఉన్నారు. అయితే, ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాత్రం దానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇవ్వడంలోనూ, దాని మద్దతు తీసుకోవడంలో సీమాంధ్ర ఉద్యోగ సంఘాల్లో రెండు అభిప్రాయాలు చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన సచివాలయ ఉద్యోగుల ప్రతినిధులు బుధవారం జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన మద్దతు కోరారు. మురళీకృష్ణ, వెంకటరామిరెడ్డి నాయకత్వంలోని వారు జగన్‌ను కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనాలని ఆహ్వానించారు.
తాను కోర్టు షరతుల కారణంగా హైదరాబాద్ విడిచి వెళ్లడానికి వీలు కాదని, తమ పార్టీ శాసనసభ్యులు ధర్నాలో పాల్గొంటారని ఆయన చెప్పినట్లు సమాచారం. తన తల్లి వైయస్ విజయమ్మ కూడా ధర్నాలో పాల్గొంటారని ఆయన చెప్పారని అంటున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో విజయమ్మ పాల్గొంటారా అనే ఆసక్తి ఇప్పుడు నెలకొని ఉంది.
రెండు కళ్ల సిద్ధాంతానికి స్వస్తి చెప్పే విధంగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని జగన్ సీమాంధ్ర ఉద్యోగులకు సూచించినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డిని మురళీకృష్ణ ప్రశంలతో ముంచెత్తారు కూడా. దాదాపుగా మొదటి సారి ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్సించారు. తెలంగాణ మద్దతును ఉపసంహరించుకోవాలని వారు చంద్రబాబును డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications