జైలులో రెండు వారాలు: నిబ్బరంగా జయలలిత
బెంగళూర్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలిత రెండు వారాలుగా జైలులో ఉంటున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జయలలిత ఏ మాత్రం కలత చెందినట్లు కనిపించడం లేదని వారన్నారు. తన జీవితం నాశనమైపోయిందనే ఆవేదన ఏ మాత్రం ఆమెలో కనిపించడం లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను జయలలితను చూడలేదని, జైలులో గస్తీ తిరుగుతున్నప్పుడు చూశానని, ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఫిట్‌గా ఉన్నారని జైళ్ల శాఖ డిఐడి పిఎం జైసింహ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.
జయలలితకు బెంగళూర్ ప్రత్యేక కోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. దాంతో అక్టోబర్ 10వ తేదీన సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అది ఈ నెల 17వ తేదీన విచారణకు రానుంది.

జయలలిత చాలా కఠినంగా ఉంటారని, సాధారణంగా ఆమె దర్శనం లభించిదని అంటారు. అటువంటి జయలలిత జైలులో ఏ విధమైన ఇబ్బందులు కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని జైలు అధికారులు అంటున్నారు. జైలు అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. అన్నాడియంకె మంత్రులను, శాసనసభ్యులను కలవడానికి ఆమె నిరాకరించారు.
సాయంత్రం ఐదున్నర గంటలకు సెల్‌లో తాను జయలలితను కలిశానని, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగానని, సమస్యలేవీ లేవని చెప్పారని, తన డిమాండ్లను అంగీకరించినందుకు కృతజ్ఞతలు చెప్పారని జైసింహ చెప్పారు. ఆమె మధ్యాహ్నం, రాత్రి వేళల్లో పెరుగున్నం తింటున్నారు. వాటితో పాటు అరటిపండ్లు గానీ ఆపిల్ గానీ తీసుకుంటున్నారు. ఉదయం పూట పాలతో బ్రెడ్, ఆ తర్వాత వేడి కాఫీ తీసుకుంటున్నారు.
తన ఆహారం పట్ల జయలలిత కఠినంగా ఉంటున్నారని జైసింహ చెప్పారు. జయలలిత వార్తాపత్రికలను ఇష్టంగా చదువుతున్నారని, దాదాపు గంటన్నర సేపు వాటిని చదవడంలో గడిపేస్తున్నారని ఆయన చెప్పారు. తమిళ, ఆంగ్ల పత్రికలు చదువుతున్నట్లు చెప్పారు. దినతంతి, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇతర వార్తాపత్రికలను ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు చదువుతున్నారు.












Click it and Unblock the Notifications