బాబు 'బడా' ప్లాన్: జగన్‌తో బీజేపీకి చుక్కలు చూపించాలనుకున్న టిడిపి?
విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ షాకివ్వాలని భావించిందా? నాలుగో సీటును కమలం పార్టీకి అప్పగించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేసిందా? అంటే అవుననే వాదనలు వినిపించాయి.
రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రెండు స్థానాలు టిడిపి గెలుచుకోగా, టిడిపి మద్దతుతో ఒక స్థానాన్ని బిజెపి గెలుచుకుంటుంది. నాలుగో స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే సంఖ్యా బలం ఉంది.
నాలుగో స్థానం విషయంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతున్న విషయం తెలిసిందే. వైసిపికి బలం ఉన్నందున పోటీ చేయించాలా లేదా అనే చర్చ జరిగింది. వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలతో సోమవారం సుదీర్ఘంగా మాట్లాడి.. నాలుగో సీటుపై ఏం చేద్దామనే అంశంపై చర్చించారు.
హోదా, నిధుల ఎఫెక్ట్.. నాలుగో సీటు
అయితే, అంతకుముందే నాలుగో సీటును బీజేపీకి అప్పగించి చేతులు దులుపుకోవాలని టిడిపి భావించినట్లుగా తెలుస్తోంది. ఏపీకి కేంద్రం నుంచి ఆశించిన నిధులు రావడం లేదని, ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని టిడిపి నేతలు, చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో టిడిపి - బిజెపి సంబంధాలు, రాజ్యసభ అంశం బాగా చర్చనీయాంశమైంది. బీజేపీకి రాజ్యసభ సీటు చంద్రబాబు ఇచ్చేనా? అసలు బీజేపీ తీసుకుంటుందా? అని జోరుగా చర్చ జరిగింది. అయితే, ఎట్టకేలకు మూడో అభ్యర్థిగా కేంద్రమంత్రి, బీజేపీ నేత సురేష్ ప్రభును ఎంపిక చేశారు.

అయితే, నాలుగో సీటును బీజేపీకి అప్పగించి, తొలి మూడు సీట్లలో టిడిపి అభ్యర్థులను బరిలోకి దింపాలని కొంతమంది నేతలు.. చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. ఈ విషయమై తర్జన భర్జన పడిన చంద్రబాబు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఇలాంటి చిక్కులు వద్దని, మూడో సీటు ఇద్దామని నిర్ణయించారని సమాచారం.
బలం ప్రకారం.. నాలుగో సీటును వైసిపి గెలుచుకుంటుంది. ప్రస్తుతం టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలు, వైసిపిలోని దాదాపు ఇరవైకి పైగా ఎమ్మెల్యేలు నాలుగో అభ్యర్థికి ఓటు వేస్తేనే టిడిపి లేదా బీజేపీ నిలబెట్టే నాలుగో అభ్యర్థి గెలిచే అవకాశముంది. కానీ, అది సాధ్యం కాకపోవచ్చు.
ఇప్పటికే వైసిపిలో ఉన్న ఎమ్మెల్యేలతో టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇది ఎంతవరకు సఫలమౌతుందనే విషయాన్ని పక్కన పెడితే... నాలుగో సీటు కోసం జంపింగ్ ఎమ్మెల్యేలతో పాటు వైసిపి ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. అది కుదిరే పని కాదనే చెప్పవచ్చు.
ఈ ఉద్దేశ్యంతో.. నాలుగో సీటును బీజేపీకి ఇచ్చేసి టిడిపి చేతులు దులుపుకునే ప్రయత్నం తొలుత చేసిందని అంటున్నారు. అప్పుడు బీజేపీయే నాలుగో సీటు కోసం ఇటు జంపింగ్ ఎమ్మెల్యేలతో పాటు, అటు వైసిపి ఎమ్మెల్యేలను బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలా బీజేపీకి చుక్కలు చూపిద్దామని టిడిపి భావించారని, కానీ ఏపీకి కేంద్రం సహకారం అవసమరైన దృష్ట్యా చంద్రబాబు అంత ధైర్యం చేయలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆలోచన చేసిన సమయంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబుతో చర్చించి, సురేష్ ప్రభుకు ఓకే చేయించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications