టీటీడీకి హైదరాబాద్ అజ్ఞాత భక్తుడు రూ. కోటి విరాళం
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 83,091 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,670 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 5.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది.
వేసవి సెలవులు, అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దీనికోసం సుమారు రెండు కోట్ల రూపాయలను వ్యయం చేసింది. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు వేశారు టీటీడీ అధికారులు.

మరో వంక టీటీడీకి భారీ మొత్తంలో కానుకలు, విరాళాలు అందుతున్నాయి. సోమవారం ఒక్కరోజే హుండీ ద్వారా అందిన కానుకల మొత్తం అయిదు కోట్ల రూపాయలను దాటింది. అలాగే శ్రీవారి సేవలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. మొత్తం రూ.1,00,10,116 విరాళంతో కూడిన డీడీని టీటీడీ పరిపాలనా భవనంలో కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్రకు అందించారు.
అలాగే భువనేశ్వర్‌కు చెందిన బల్ భద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10,01,000 రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర.. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.












Click it and Unblock the Notifications