పెట్రోల్ బంకులు సీజ్. వార్నింగ్ కాదు.. డైరెక్ట్ ఎటాక్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన విక్రయాల విషయంలో పద్ధతి మార్చుకోని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ప్రభుత్వం 'లాస్ట్ వార్నింగ్' ఇచ్చింది. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం.. ధరల పెరుగుదల వార్తలను సాకుగా చూపిస్తూ.. ఉద్దేశపూర్వకంగా ' నో స్టాక్' బోర్డులు పెడితే సహించేది లేదని తేల్చి చెప్పింది. లాభాపేక్షతో ఇంధనాన్ని నిల్వ చేసి, బ్లాక్ మార్కెట్‌కు తరలించే ప్రయత్నం చేస్తే భారీ జరిమానాలతో పాటు సదరు పెట్రోల్ బంకులను శాశ్వతంగా సీజ్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు మరియు ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయిల్ కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో స్వయంగా ఆరా తీశారు. రాత్రంతా డిస్పాచ్ ప్రక్రియ కొనసాగిందని, ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 1,402 లోడ్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

లెక్కలు తేల్చిన అధికారులు
గత అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,173 కిలో లీటర్ల పెట్రోల్, 2,846 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు గణాంకాలను వెల్లడించారు. స్టాక్ లేని బంకుల సంఖ్య నిన్నటితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 432 బంకుల్లో మాత్రమే లభ్యత లేదని, మిగిలిన అన్ని చోట్లా నిరంతర సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
అక్రమ నిల్వలకు చెక్.. అధికారుల నిఘా
ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడం, త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో కొందరు నిర్వాహకులు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి బంకులో స్టాక్ ఉండేలా పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించే బంకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
కలెక్టర్ల వార్నింగ్ నోట్
పల్నాడు జిల్లాలో రెండు పెట్రోల్ బంకులను సీజ్ చేశాం. నరసరావు పేట పట్టణంలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్లు. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి సామాన్యుడిని అవస్థలకు గురిచేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బంకులను తనిఖీ చేసి, అక్రమ నిల్వలు గుర్తిస్తే లైసెన్స్‌ల రద్దుతో పాటు కఠినమైన జరిమానాలు విధిస్తాం. - పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా














Click it and Unblock the Notifications