పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం గుడ్ న్యూస్
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, కొన్ని వార్తా సంస్థల్లోనూ "ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 పెరుగుతాయి" అంటూ వస్తున్న వార్తలతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం ప్రజలను భయాందోళనకు గురిచేసే 'ఫేక్ న్యూస్' అని తేల్చి చెప్పింది.
"పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం ముందు లేదు" అని పెట్రోలియం శాఖ అధికారికంగా ప్రకటించింది. అడ్డగోలుగా ధరలు పెరుగుతాయని ప్రచారం చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని పౌరులకు విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎగిసిపడుతున్నా.. మన దేశంలో మాత్రం రేట్లు స్థిరంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది.

ప్రపంచంలోనే రికార్డ్: భారత్ ఒక్కటే ప్రత్యేకం!
కేంద్ర ప్రభుత్వం తన ట్వీట్‌లో ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించింది. గత 4 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచని ఏకైక దేశం ప్రపంచంలో భారత్ మాత్రమేనని గర్వంగా ప్రకటించింది. అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నా.. భారత ప్రభుత్వం, చమురు రంగ ప్రభుత్వ సంస్థలు (Oil PSUs) తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల సామాన్యుడిపై భారం పడకుండా కాపాడగలిగామని పేర్కొంది.
పౌరుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
అంతర్జాతీయ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పటికీ, భారత పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోంది. ధరలు పెంచకుండా ఉండటమే కాకుండా, ముడి చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ అధికారిక ప్రకటనతో వాహనదారులందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications