పవనన్నా "ప్లీజ్ కాపాడండన్నా".. నన్ను చంపేస్తారు !!
పొట్టకూటి కోసం విదేశాల బాట పట్టిన ఓ తెలుగు మహిళకు ఎదురైన దారుణ పరిస్థితి... ఇప్పుడు హృదయాలను కదిలిస్తోంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ అనే మహిళ.. మస్కట్‌లో ఎదుర్కొంటున్న నరకయాతనను వీడియో రూపంలో బయటపెట్టి సహాయం కోరింది. కన్నీళ్లతో పవనన్నా "ప్లీజ్ కాపాడండన్నా".. నన్ను చంపేస్తారు అంటూ ఆమె చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ కలచివేస్తోంది.
అసలేం జరిగిందంటే..?
పేదరికంతో పోరాడుతూ ముగ్గురు చిన్నారుల భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలని సంకల్పించిన షానల్... అప్పులు చేసి మరీ ఓ ఏజెంట్ సహాయంతో విదేశాలకు వెళ్లింది. మంచి జీతం, మంచి పని ఉంటుందని నమ్మి అడుగు పెట్టిన ఆ నేల... ఆమెకు ఊహించని కష్టాల బాటను చూపింది. కుటుంబానికి బలంగా నిలవాలని వెళ్లిన ఆమె... ఇప్పుడు తాను బతకడమే కష్టమైపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటోంది.

మస్కట్‌కు వెళ్లిన కొద్దిరోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయిందని షానల్ తెలిపింది. తన యజమాని (సేఠ్) రోజూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని.. కొన్నిసార్లు గదిలో బంధించి ఆహారం, నీరు కూడా ఇవ్వడంలేదని ఆమె వాపోయింది. బయటకు వెళ్లే అవకాశం లేకుండా పూర్తిగా నిర్బంధంలో ఉంచుతున్నారని, సహాయం కోసం ఎవరికీ ఫోన్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వడంలేదని చెప్పింది. తీవ్ర ఒత్తిడి, భయంతో తాను ఆరోగ్యంగా కూడా లేనని, ఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చిందని ఆమె తెలిపింది.
ప్రాణ భయంతో బాత్రూంలోకి వెళ్లి, ఎవరికీ తెలియకుండా తన ఫోన్‌లో ఈ వీడియోను రికార్డు చేసినట్లు షానల్ వెల్లడించింది. "నన్ను కాపాడండి... నేను బతకలేకపోతున్నాను... నేను చనిపోతే నా పిల్లలు అనాథలవుతారు..." అంటూ ఆమె చేసిన వేడుకోలు ఎవరి మనసునైనా కదిలించేలా ఉన్నాయి. ఒక తల్లి తన పిల్లల కోసం ఎంతటి బాధనైనా భరిస్తుందో... కానీ చివరికి సహాయం కోసం ఇలా విలపించాల్సి రావడం బాధాకరం.
ఈ వీడియోలో షానల్ ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanను ఉద్దేశించి విజ్ఞప్తి చేసింది. "సార్... మీరు వెంటనే స్పందించి నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లాలి... నా పిల్లల కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను" అంటూ ఆమె చేసిన విజ్ఞప్తి మరింత హృదయ విదారకంగా మారింది. అయితే ఇలాంటి ఘటనలు కొత్తవి కావని.. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లే చాలా మంది మహిళలు మోసపోయి ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారని వాపోతున్నారు. సరైన ఒప్పందాలు లేకపోవడం, ఏజెంట్ల మోసాలు, భాష తెలియకపోవడం వంటి కారణాలతో వారు బయటపడలేని పరిస్థితుల్లో పడిపోతున్నారని స్పష్టం చేస్తున్నారు.
అందుకే విదేశాలకు వెళ్లే ముందు ప్రభుత్వ అనుమతులు, అధికారిక రిక్రూట్‌మెంట్ మార్గాలు, ఎంబసీ వివరాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆమెను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒక తల్లి కన్నీటి ఆవేదనతో ముగ్గురు చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంలో సుఖాంతం కావాలని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications