తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత..ఆయిల్ కంపెనీలు ఏమన్నాయంటే
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఉందంటూ వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పెట్రోల్, డీజిల్ మరియు ఎల్‌పీజీ సిలిండర్ల కొరతపై ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఖండించాయి. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరుగుతోందని స్పష్టం చేశాయి. ఈ విషయంపై ఓఎంసీల రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఒక ప్రకటన విడుదల చేసి ప్రజలను భరోసా కల్పించారు.
పెట్రోల్, డీజిల్ డిమాండ్, సరఫరా వ్యవస్థపై ఆయిల్ కంపెనీలు ఏం చేస్తున్నారంటే
ప్రస్తుతం రాష్ట్రంలో ఇంధన వినియోగం గణనీయంగా పెరిగినా, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కంపెనీలు తెలిపాయి. మే నెల మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్ అమ్మకాలు 14.2 శాతం, డీజిల్ అమ్మకాలు 15.7 శాతం వృద్ధి చెందాయి. ఇంత ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని, రవాణా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఎల్‌పీజీ సిలిండర్లపై ఆయిల్ కంపెనీలు చెప్పిందిదే
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. వేసవి కాలం నేపథ్యంలో గృహాల్లో వంట గ్యాస్ బుకింగ్స్ కొంత తగ్గినట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల వినియోగదారులు ముందస్తు బుకింగ్స్ చేయడం తగ్గిందని, ఇది ఈ సీజన్‌కు సాధారణమని వివరించారు. మే 17 వరకు 20.06 లక్షల గృహావసర ఎల్‌పీజీ సిలిండర్లను విజయవంతంగా డెలివరీ చేశామని ప్రకటించారు.
గ్యాస్ డెలివరీలో ఈ విధానం
బుకింగ్ కోసం SMS, Missed Call, IVRS లేదా ఆన్‌లైన్ వేదికలను వాడాలని సూచించారు. అక్రమాలను నివారించడానికి అమలు చేస్తున్న OTP ఆధారిత డెలివరీ విధానం తెలంగాణలో 95 శాతం విజయవంతంగా అమలవుతోంది. దీన్ని 100 శాతానికి చేర్చడమే లక్ష్యంగా ఏజెన్సీలు పని చేస్తున్నాయి. డెలివరీ సమయంలో వినియోగదారులు OTP షేర్ చేసి సహకరించాలని కంపెనీలు విజ్ఞప్తి చేశాయి.
ఆ వార్తలపై ఆయిల్ కంపెనీల హెచ్చరిక
సోషల్ మీడియాలో వస్తున్న కొరత సంబంధిత నకిలీ వార్తలు, వదంతులను నమ్మవద్దని ఆయిల్ కంపెనీలు స్పష్టంగా హెచ్చరించాయి. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మి, ఆందోళన చెందకుండా సాధారణంగా ఇంధనం, గ్యాస్ ఉపయోగించాలని సూచించారు.
.













Click it and Unblock the Notifications