చింత లేకుండా శ్రీవారి దర్శనం: తిరుమలలో వసతి గదులు లభించని భక్తుల కోసం..
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 70,001 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,085 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.77 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది.
తిరుమలలో వసతి గదులు పొందదలచిన భక్తులు సీఆర్వో జనరల్ కౌంటర్ లో ఆధార్ కార్డు, ఫోన్ నంబరు తదితర వివరాలను నమోదు చేయాలి. అనంతరం కేటాయించిన గది నంబర్, ఆ ప్రాంత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా భక్తులకు అందుతాయి. భక్తులు సంబంధిత కార్యాలయంలో యూపీఐ/కార్డు ద్వారా చెల్లింపు చేసి గదిని పొందవచ్చు. తిరుమలలో 7,800 వసతి గదులు అందుబాటులో ఉన్నందున కుటుంబాలతో వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఉంటుంది.

వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో అయిదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు నమోదు చేసి ఉచిత లాకర్లు, ఇతర సౌకర్యాలను పొందవచ్చు.
పీఏసీ-1
సీఆర్వో సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 4 హాళ్లు, 1,256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనుల కారణంగా 870 లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నప్రసాదం సౌకర్యం కలదు.
పీఏసీ-2 (మాధవ నిలయం)
బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 12 హాళ్లు, 3300 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రం, విశ్రాంతి సదుపాయాలు కల్పించబడ్డాయి.
పీఏసీ-3
జీఎన్సీ టోల్ గేట్ నుండి రాంభగీచా బస్ స్టాండ్కు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న ఈ భవనంలో 9 హాళ్లు, 1420 లాకర్లు ఉన్నాయి. తలనీలాలు సమర్పించే సదుపాయం, విశ్రాంతి సౌకర్యం కలదు.
పద్మనాభ నిలయం
బాలాజీ బస్ స్టాండ్ లోపల ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 3 హాళ్లు, 960 లాకర్లు ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి, లాకర్, స్నాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
పీఏసీ-5 (వేంకటాద్రి నిలయం)
భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ ఆధునిక సముదాయంలో 16 హాళ్లు, 2,400 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పణ, ప్రథమ చికిత్స, విశ్రాంతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
భక్తులకు అందుబాటులో 9336 ఉచిత లాకర్లు
తిరుమలలోని ఈ అయిదు యాత్రికుల వసతి సముదాయాలన్నింటిలో కలిపి మొత్తం 9336 లాకర్లు భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. భక్తులు తమ విలువైన వస్తువులను భద్రపరచుకోవడానికి వీటిని వినియోగించుకోవచ్చు. ఈ కేంద్రాలలో ఉచిత వేడి నీటి స్నాన గదులు, మరుగుదొడ్లు, చాపలు, రగ్గులు, అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications