బెంగాల్ లో డే వన్ కే డ్యూటీ ఎక్కిన తృణమూల్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్వాతంత్ర్యం తర్వాత బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఇదే తొలిసారి. ఆ రాష్ట్ర చరిత్రలో చారిత్రక ఘట్టంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు దీనికి హాజరయ్యారు.
సువేందు అధికారి ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ తెరమీదికి వచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు. దాదాపు 30 లక్షల మంది ఓటర్లను జాబితాల నుండి అన్యాయంగా తొలగించారని, ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వ సంస్థలు పక్షపాతంగా వ్యవహరించాయని ఆరోపించారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ప్రజాస్వామ్య సంస్థలు రాజీపడినట్లు కనిపించాయని అన్నారు.

ఇది ఎన్నికల పారదర్శకత, విశ్వసనీయతపై తీవ్ర ఆందోళనలను పెంచిందని, ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ, ఈవీఎం నిర్వహణ, కంట్రోల్ యూనిట్లలో తేడాలు వంటి ఘటనలు ప్రజల్లో సందేహాలు రేకెత్తించాయని, కౌంటింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజ్, వీవీప్యాట్ స్లిప్‌ల పారదర్శక లెక్కింపుపై సందేహాలు లేవనెత్తారు. వాటిని బహిరంగపర్చాలని, తద్వారా నిజం బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికల అనంతర హింస, పార్టీ కార్యాలయాలపై దాడులు, కార్యకర్తలను బెదిరించడం తీవ్ర ఆందోళనకరమని అభిషేక్ బెనర్జీ అన్నారు. భయం, అభద్రత కారణంగా అనేకమంది తృణమూల్ కార్యకర్తలు ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ తమ భద్రతకు, రాజకీయ విశ్వాసాలకు మధ్య ఎంపిక చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో పశ్చిమ బెంగాల్ ప్రజలు, ప్రతి తృణమూల్ కార్యకర్తకు తాను అండగా నిలుస్తానని బెనర్జీ ప్రకటించారు.
ఢిల్లీలోనూ, రాష్ట్రంలోనూ బలమైన, రాజీలేని ప్రతిపక్షంగా కొనసాగుతామని ఆయన హామీ ఇచ్చారు. మమతా బెనర్జీ మార్గదర్శకత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రతి తృణమూల్ మద్దతుదారుడు, కార్యకర్త బలంగా, ఐక్యంగా ఉండాలని అభిషేక్ బెనర్జీ పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతర హింసకు గురైన వారు వివరాలను తనతో పంచుకోవాలని బెనర్జీ కోరారు. వారి భద్రతకు కృషి చేస్తానని, అన్ని చట్టపరమైన, ప్రజాస్వామ్య పరిష్కారాలను అనుసరిస్తానని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు నిజాయితీగా పనిచేయాలని, దీనికోసం ప్రతి కార్యకర్తతో కలిసి పోరాడుతానన్నారు.












Click it and Unblock the Notifications