టాప్ సైంటిస్టులను ఎవరో చంపేస్తున్నారా? హాలీవుడ్ థ్రిల్లర్ ను తలపిస్తున్న రియల్ స్టోరీ..
అమెరికా అణు, అంతరిక్ష కార్యక్రమాల వెనుక ఉన్న మెదళ్లు ఒక్కొక్కటిగా నిశ్శబ్దమైపోతున్నాయి. గత మూడేళ్లుగా కనీసం పది మంది అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు అనుమానాస్పద స్థితిలో మరణించడం లేదా అదృశ్యం కావడం ఇప్పుడు జాతీయ భద్రతా సంక్షోభానికి దారితీసింది. దీనిపై విచారణ చేపట్టిన 'హౌస్ ఓవర్‌సైట్ కమిటీ' ఛైర్మన్ జేమ్స్ కూమర్, ప్రతినిధి ఎరిక్ బర్లిసన్ ఈ ఘటనల వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ మిస్టరీ వెనుక ఉన్న అదృశ్య హస్తాలను వెలికితీయాలని కోరుతూ కమిటీ కీలక అధికారులకు లేఖలు రాసింది. ఇందులో ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్, నాసా (NASA) అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐసాక్‌మాన్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్, డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్‌లు ఉన్నారు. ఏప్రిల్ 27లోగా వీరంతా ఈ ఘటనలపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశించింది.]

మేజర్ జనరల్ అదృశ్యం.. వదిలి వెళ్ళిన క్లూస్ ఏంటి?
ఈ కేసులో అత్యంత కీలకమైనది వైమానిక దళ రిటైర్డ్ మేజర్ జనరల్ విలియం నీల్ మెక్‌కాస్లాండ్ అదృశ్యం. ఫిబ్రవరి 27న ఆయన తన ఇంటి నుంచి వెళ్తూ తన పర్సు, తుపాకీని వెంట తీసుకెళ్లారు. కానీ, ప్రస్తుత రోజుల్లో మనందరం చాలా ముఖ్యంగా భావించే ఫోన్, కళ్ళజోడు, టెక్ గాడ్జెట్‌లను ఇంట్లోనే వదిలి వెళ్లడం దర్యాప్తు అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఆయన పెంటాగన్ లోని అత్యంత రహస్య ఏరోస్పేస్ ప్రోగ్రామ్‌లను పర్యవేక్షించిన వ్యక్తి కావడం గమనార్హం.
తీరని లోటు.. అంతుచిక్కని మరణాలు
అమెరికా వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో ఈ కేసులు కేంద్రీకృతమై ఉన్నాయి:
కాలిఫోర్నియా (JPL శాస్త్రవేత్తలు):
నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో పనిచేసిన మైకేల్ హిక్స్ (2023), ఫ్రాంక్ మైవాల్డ్ (2024) మరణించగా, ల్యాబ్ మెటీరియల్స్ గ్రూప్ డైరెక్టర్ మోనికా రజా జూన్ 2025 నుండి కనిపించకుండా పోయారు. విచిత్రమేమిటంటే మోనికా రజా, మెక్‌కాస్లాండ్‌లు గతంలో ఒకే ఎయిర్ ఫోర్స్ బేస్‌లో పనిచేశారు.
న్యూ మెక్సికో (న్యూక్లియర్ ల్యాబ్స్):
లాస్ అలమోస్ నేషనల్ ల్యాబ్‌కు చెందిన ఆంథోనీ చావెజ్, మెలిస్సా కాసియాస్, స్టీవెన్ గార్సియా అనే ముగ్గురు నిపుణులు 2025లో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే అదృశ్యమయ్యారు.
మసాచుసెట్స్ (MIT ప్రొఫెసర్ హత్య):
ఎంఐటీ ప్రొఫెసర్ నూనో లౌరీరియో డిసెంబర్ 2025లో తన ఇంటి బయటే కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో అదృశ్యమైన ఫార్మా శాస్త్రవేత్త జేసన్ థామస్ మృతదేహం మార్చిలో లభ్యమైంది.
విదేశీ శక్తుల హస్తం ఉందా?
ఈ మేధావులందరికీ అమెరికా అణు వ్యూహాలు, అంతరిక్ష రహస్యాలు క్షుణ్ణంగా తెలుసు. వీరిని లక్ష్యంగా చేసుకోవడం వెనుక చైనా, రష్యా లేదా ఉత్తర కొరియా వంటి దేశాల నిఘా సంస్థల ప్రమేయం ఉండవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ వీరు అపహరణకు గురై ఉంటే, అమెరికా రక్షణ రహస్యాలు శత్రువుల చేతికి చిక్కినట్లేననే ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యక్తిగత కారణాలా? లేక అంతర్జాతీయ కుట్రలా? అనే ప్రశ్నలకు సమాధానం ఏప్రిల్ 27న ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చే నివేదికల్లోనే దొరకవచ్చు. అప్పటి వరకు అగ్రరాజ్యపు మేధావుల ప్రాణాలకు గ్యారెంటీ లేని స్థితి నెలకొంది.














Click it and Unblock the Notifications