ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం?
పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి వెంట ఒక్కసారిగా "శాంతి" మాటలు రావడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) ప్రారంభించినప్పటి నుంచి అత్యంత కఠినంగా వ్యవహరించిన ట్రంప్, ఇప్పుడు ఇరాన్‌తో "చాలా మంచి చర్చలు" జరుగుతున్నాయని ప్రకటించడం పెను సంచలనంగా మారింది. అయితే, ఈ చర్చల సారాంశం ఏంటి? ఇరాన్ అణు కార్యక్రమమా? లేక క్షిపణి ప్రయోగాలా? అన్న దానిపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపత్తుల వంటి 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz)ను ఇరాన్ తన అదుపులోకి తీసుకోవడం ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన మలుపు. ఇరాన్ వద్ద ఉన్న అతిపెద్ద ఆయుధం ఇదేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్గాన్ని తిరిగి తెరిపించడం కోసం ట్రంప్ తెర వెనుక ఏదైనా బలమైన ఒప్పందం చేసుకుంటున్నారా? లేక సైనిక చర్యలకు ముందు మార్కెట్లను స్థిరీకరించడానికి 'సమయం' (Buying Time) కోరుతున్నారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ట్రంప్ తరచూ తన నిర్ణయాలను మార్చుకోవడం మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలను కూడా ఇరకాటంలో పడేస్తోంది.

Israel వైఖరి ఏంటి? మిత్రదేశంలో మొదలైన గుబులు!
ఈ మొత్తం డ్రామాలో అందరి కళ్లూ ఇప్పుడు ఇజ్రాయెల్ పైనే ఉన్నాయి. ఇరాన్ అంటే నిప్పులు చెరిగే ఇజ్రాయెల్.. ట్రంప్ తాజా ప్రకటనపై ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఇజ్రాయెల్ అధికారులు చర్చలకు మద్దతు ఇస్తున్నారా? లేక కాల్పుల విరమణను వ్యతిరేకిస్తున్నారా? అన్నది అస్పష్టంగా ఉంది. ఒకవేళ ట్రంప్ ఇరాన్‌తో ఏదైనా రాజీకి వస్తే, అది ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా మారుతుందని టెల్ అవీవ్ భయపడుతోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ పై నిరంతరం సైనిక ఒత్తిడి ఉండాలని కోరుకునే ఇజ్రాయెల్, ట్రంప్ 'మెత్తబడటం'పై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
అయోమయంలో అగ్రరాజ్య వ్యూహం!
వారాంతంలో ఇరు దేశాలు పరస్పరం బాంబు దాడుల హెచ్చరికలు చేసుకున్నాయి. తీరా సోమవారం వచ్చేసరికి ట్రంప్ స్వరంలో మార్పు రావడం ఆయన 'అస్థిరత్వ' ధోరణిని (Inconsistency) మరోసారి బయటపెట్టింది. ఇరాన్ మాత్రం అసలు చర్చలే లేవని బుకాయిస్తోంది. ఈ గందరగోళం మధ్య ఇజ్రాయెల్ తన తదుపరి అడుగును ఎలా వేయబోతోంది? అమెరికాతో కలిసి ముందుకు సాగుతుందా లేక సొంతంగా ఇరాన్ పై మెరుపు దాడులకు దిగుతుందా? అన్నది రాబోయే కొద్ది గంటల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications