తమిళనాడు సీఎంగా తిరుమావళవన్ ? డీఎంకే-అన్నాడీఎంకే కలిసి..!
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అయ్యే కొద్దీ సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విజయ్ ను మెజార్టీ లేదన్న కారణం చూపుతూ గవర్నర్ పదే పదే వెనక్కి పంపుతున్న నపేథ్యంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే-అన్నాడీఎంకే తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా నిన్న మొన్నటివరకూ డీఎంకే కూటమిలో ఉంటూ ఇప్పుడు విజయ్ మద్దతు అడిగితే డిప్యూటీ సీఎం పదవి, తిరుచ్చిలో విజయ్ ఖాళీ చేయబోయే సీటు అడుగుతున్న వీసీకే అధినేత తిరుమావళవన్ (Thirumavalavan).. తానే సీఎం అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
విజయ్ ను సీఎం కానివ్వరాదని భావిస్తున్న డీఎంకే-అన్నాడీఎంకే ప్రత్యామ్నాయాలపై తీవ్ర స్ధాయిలో చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా విజయ్ కు మద్దతిచ్చిన చివరి పార్టీ వీసీకేపై ఫోకస్ పెట్టాయి. విజయ్ సీఎం కాకుండా ఆపేందుకు ఏకంగా వీసీకే అధినేత తిరుమావళవన్ కు సీఎం పదవిని ఇరు పార్టీలు కలిసి ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దళిత పార్టీగా పేరున్న వీసీకేకు రెండు కూటములు అండగా నిలవడం ద్వారా అవసరమైన మెజార్టీ సాధించవచ్చనేది వీరి ప్లాన్ గా తెలుస్తోంది.

తమిళనాడు అసెంబ్లీలో వీసీకేకు ఉన్న సీట్లు రెండే. అంటే మొత్తం 234 సీట్ల అసెంబ్లీలో ఒక శాతం కన్నా తక్కువే. అయినా విజయ్ ను అడ్డుకునేందుకు తిరుమావళవన్ కు సీఎం చేస్తామని డీఎంకే-అన్నాడీఎంకే ఉమ్మడిగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన విజయ్ కు మద్దతుపై నిన్నటి నుంచి నానుస్తూ వస్తున్నారు. ఇప్పటికే విజయ్ కు రెండు సీట్ల మద్దతు కోసం ఆయన డిప్యూటీ సీఎం పదవితో పాటు విజయ్ ఖాళీ చేసే తిరుచ్చి ఈస్ట్ సీటును తమకు కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పుడు అంతకు మించి సీఎం పదవే ఇస్తామని రెండు కూటములు ఇచ్చిన ఆఫర్ పై తిరుమావళవన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన తన నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.













Click it and Unblock the Notifications