Iran War: నేటితో ఇరాన్ వార్ ముగింపు .! ట్రంప్ దారెటు ? కాంగ్రెస్ ఒప్పుకుంటుందా ?
అమెరికా ఏదైనా దేశం మీద సైనిక చర్య లేదా యుద్దం ప్రారంభిస్తే దానికి ముందుగా చట్ట సభ అయిన కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. అలా తీసుకోకుండా అత్యవసరంగా సైనిక చర్య మొదలుపెట్టినా 48 గంటల్లోగా సమాచారం ఇవ్వాలి. అలా ఇచ్చాక 60 రోజుల పాటు కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకునేందుకు వీలు ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ వార్ (iran war) విషయంలో ట్రంప్ (trump) తీసుకున్న ఛాన్స్ 60 రోజుల గడువు ఇవాళ్టితో ముగియబోతోంది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతోందన్న ఉత్కంఠ మొదలైంది.
ఫిబ్రవరి 28న ఇరాన్ పై ఉన్నట్లుండి యుద్దం ప్రారంభించిన ట్రంప్ మార్చి 2న కాంగ్రెస్ కు సమాచారం ఇచ్చారు. ఇవాళ్టితో రెండు నెలల గడుపు ముగుస్తోంది. ఇప్పుడు ఇరాన్‌పై సైనిక చర్యలను నిలిపివేయాలా లేదా కాంగ్రెస్ ఆమోదం తీసుకోవాలా అనే నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పడింది. ఈ గడువు ముగిసిన తర్వాత, కాంగ్రెస్ యుద్ధాన్ని ప్రకటించకపోతే లేదా సైనిక శక్తి వినియోగానికి అధికారిక అనుమతి ఇవ్వకపోతే, అధ్యక్షుడు సైనిక చర్యను నిలిపివేయాలి. అయితే అమెరికా బలగాలను సురక్షితంగా వెనక్కి తెచ్చే పేరుతో మరో 30 రోజుల గడువు తీసుకోవచ్చు. ఈ గడువు బలగాలను వెనక్కి తెచ్చేందుకే. దాడులను కొనసాగించడానికి కాదు.

అయితే, ట్రంప్ ప్రభుత్వం మే 1 నాటి గడువును ప్రస్తుత పరిస్థితులలో అంతిమంగా పరిగణించడం లేదు. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తాజాగా చట్ట సభ సభ్యులతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ (ceasefire) చట్టాన్ని ఎలా అన్వయించాలో మారుస్తుందని పేర్కొన్నారు. తాము ప్రస్తుతం కాల్పుల విరమణలో ఉన్నామని, దీని ప్రకారం 60 రోజుల కాలపరిమితి కాల్పుల విరమణ సమయంలో ఆగిపోతుంది లేదా నిలిపివేయబడుతుందని హెగ్సెత్ తెలిపారు. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా .. అమెరికా "యుద్ధంలో లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వాషింగ్టన్ క్రియాశీల సైనిక కార్యకలాపాలను నిర్వహించడం కంటే శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తోందన్నారు.

కాల్పుల విరమణ ఆధారిత వివరణను చట్ట సభ సభ్యులు , న్యాయ నిపుణులు ఇద్దరూ అనుమానంగా చూస్తున్నారు. డెమోక్రాట్లతో పాటు న్యాయనిపుణులు కూడా సీజ్ ఫైర్ తీసుకున్నారు కాబట్టి యుద్దం ఆగినట్లు కాదంటున్నారు. నిన్న రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని సెనేట్ యుద్ధ అధికారాల తీర్మానాన్ని తిరస్కరించింది. ఇది కాంగ్రెస్ తదుపరి సైనిక చర్యకు అధికారం ఇవ్వకపోతే ఘర్షణలను పరిమితం చేస్తుంది. ఈ తీర్మానం 47-50 ఓట్లతో వీగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ తో మాట్లాడుకుని ఈ గడువును 30 రోజులు పొడిగించుకోవడం లేదా డెమోక్రాట్లు ప్రారంభించే న్యాయపోరాటాన్ని ఎదుర్కోవడం అనే రెండు మార్గాలు ట్రంప్ ముందున్నాయి.














Click it and Unblock the Notifications