గురుద్వారా కూల్చివేత: పాకిస్థాన్ చర్యపై భారత్ ఫైర్!
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఓ స్థానిక వ్యాపారి 125 ఏళ్ల నాటి చారిత్రాత్మక గురుద్వారాను కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది. ఫరూఖాబాద్‌లోని 'గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్'పై జరిగిన ఈ దాడిని ఇండియా తీవ్రంగా ఖండించింది. సిక్కు సమాజానికి అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రాన్ని కావాలనే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారని భారత్ మండిపడింది. సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఎలా అనుమతి తీసుకోకుండానే జూన్ 24 రాత్రి ఈ చారిత్రక కట్టడాన్ని కూల్చివేసినట్లు పాక్ అధికారులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే ఈ ఉదంతంపై దర్యాప్తు జరిపించాలని.. ధ్వంసమైన గురుద్వారా భాగాలను వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌లో మైనారిటీల భద్రత, వారి మతపరమైన హక్కులను రక్షించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాలపై వ్యవస్థీకృత దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని భారత్ స్పష్టం చేసింది.

మరోవైపు ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా స్థానిక సిక్కు సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ స్పందించారు. పంజాబ్ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి రమేష్ సింగ్ అరోరా ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. మైనారిటీల హక్కులను, వారి మతపరమైన ఆస్తులను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. వివాదాస్పద భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించడమే కాకుండా.. గురుద్వారా పునరుద్ధరణ పనులను వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Another Gurdwara has been demolished in #Pakistan, the 125-year-old Gurdwara Singh Sabha Lehri in Farooqabad.
— Sukhman Randhawa (@sukh_randhawa14) July 1, 2026
There are many other Gurdwaras in Pakistan that are on the verge of either being demolished or illegally occupied by Islamists.#LostSikhHeritage https://t.co/8ovGJ9W6AK pic.twitter.com/lJc07FBGcE
అయితే ఈ పునరుద్ధరణ నిర్ణయంపై స్థానిక వ్యాపారులు, నివాసితుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత 80 ఏళ్లుగా ఈ గురుద్వారా ప్రాంగణం నిరుపయోగంగా ఉందని.. ఆ సమయంలో అనేక కుటుంబాలు అక్కడ స్థిరపడి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే పునరుద్ధరణ చర్యల వల్ల అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని.. కాబట్టి వారికి ప్రత్యామ్నాయ నివాస, ఉపాధి అవకాశాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications