NRI News: లండన్‍లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న భార్గవ్ రెడ్డి..
లండన్‍లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. బ్రిటన్ వైఎస్సార్సీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, వైఎస్సార్సీ నాయకుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్, APSSDC రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు.
బ్రిటన్ నలుమూలల నుంచి 450 మందికి పైగా వైఎస్సార్సీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారని సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పారు. ప్రజా సంక్షేమమే కాదు అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నంగా జగనన్న నిలిచారని ప్రశంసించారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు అందరం అండగా నిలవాలని కోరారు.

ఏపీలో గ్రామాలను సీఎం జగనన్న ఎంత అభివృద్ధి చేశారో మీరందరూ భారత దేశం వచ్చినప్పుడు చూస్తే ఆశ్చర్య పోతారని సజ్జల భార్గవ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా పని చేయాలో, 175/175 టార్గెట్ గా అందరం కలిసి చేద్దామని, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని భార్గవ్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో దుబాయిలో జరిగిన సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో కూడా భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు.
కొన్ని నెలల క్రితం ఏపీ సీఎం జగన్ సజ్జల భార్గవ్ రెడ్డికి మీడియా కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో భార్గవ్ రెడ్డిని సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా నియమించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా బలంగా ప్రభావితం చేసింది. అప్పుడు జగన్ పాదయాత్ర.. మేనిఫెస్టోతో పాటుగా చంద్రబాబు పాలనలోని లోపాలను..హామీల విస్మరణ గురించి సాధారణ ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications