ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే..?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ ద్వారా సంభాషించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులపై ఇరు దేశాల అధినేతలు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వివరించారు. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో తెలిపారు.
అయితే పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. సమస్యలను ఎప్పుడూ చర్చలు, దౌత్య పరంగానే పరిష్కరించుకోవాలని భారత్ ఎల్లప్పుడూ ఈ విధానానికే కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ సవాళ్లు, సమస్యలను శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం అవసరమని తెలిపారు.
అలాగే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో సముద్రయాన స్వేచ్ఛ, వాణిజ్యాన్ని రక్షించడం కూడా చాలా కీలకమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి గుండా సాఫీ ప్రయాణం భారత్ తో పాటు ప్రపంచ దేశాలకూ ముఖ్యం అని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్ కాల్ అనంతరం ఇదే విషయాన్ని ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. శాంతి చేకూరాలని ఈ మేరకు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదివరకు కూడా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ సంభాషించిన విషయం తెలిసిందే. అలాగే కొద్దిరోజుల క్రితం అమెరికా-ఇరాన్ మధ్య 14 అంశాలతో కూడిన అవగాహన ఒప్పందం కుదిరినట్లు సమాచారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్- ఇరాన్ దేశాధినేతలు తాజాగా సంభాషించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications