అమెరికాలో సైలెంట్ గా వేల ఉద్యోగాల్ని మింగేస్తున్న ఏఐ ..!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ వేలాది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతి రోజూ కొత్త కొత్త ఏఐ టూల్స్ కొంగొత్త ఫీచర్లతో పుట్టుకొస్తున్నాయి. మనిషి చేసే పని కన్నా ఎంతో వేగంగా, సమర్ధవంతంగా ఇవి పనిచేస్తున్నాయి. దీంతో సంస్థలు కూడా ఉద్యోగుల్ని ఏఐతో భర్తీ చేసే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఏఐ కారణంగా వేలాది ఉద్యోగాలు సైలెంట్ గా ఎగిరిపోతున్నట్లు తాజాగా వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది.
అసలే ఓవైపు అమెరికా ప్రపంచ దేశాలతో వాణిజ్య పోరు కొనసాగిస్తోంది. దీంతో ఉద్యోగ మార్కెట్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అదే సమయంలో ఏఐ రూపంలో ఉద్యోగాల మార్కెట్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూలై వరకూ ప్రైవేటు సంస్ధలు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని 10 వేలకు పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపేశాయి. ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ ఈ వారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. అంతే కాదు ఈ ఏడాది ఉద్యోగాలు పోవడానికి కారణమయ్యే ఐదు ప్రధాన కారణాల్లో ఏఐ ఒకటి కాబోతున్నట్లు పేర్కొంది.

తాజా డేటా ప్రకారం అమెరికాలో ప్రైవేటు సంస్ధలు జూలై నెలలో కేవలం 73 వేల ఉద్యోగాల్ని మాత్రమే భర్తీ చేశాయి. దీంతో నియామకాల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు తేలిపోయింది. అదే సమయంలో జూలై నాటికి కంపెనీలు 8 లక్షలకు పైగా లే ఆఫ్స్ ప్రకటించాయి. 2020లో కరోనా పరిస్ధితులతో పోల్చినా ఇది ఎక్కువని తాజా రిపోర్టు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 36 శాతం ఎక్కువని తెలిపింది. వీటన్నింటి వెనుకా ఉన్నది ఏఐ మాత్రమేనని తేలింది.

అలాగే ఏఐ ప్రభావం యువతపై ఎక్కువగా ఉందని, తాజా కాలేజ్ గ్రాడ్యుయేట్లకు దొరికే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల లిస్టింగ్స్ 15 శాతం మేర తగ్గిపోయినట్లు జెన్ జీ ఉద్యోగుల కెరీర్ ప్లాట్‌ఫామ్ హ్యాండ్‌షేక్ తెలిపింది. రెండేళ్లుగా ఉద్యోగ వివరణలలో ఏఐని వాడే సంస్థల్లో ఏకంగా 400 శాతం పెరుగుదల ఉందని సంస్థ వెల్లడించింది. ఓవైపు ట్రంప్ సర్కార్ వచ్చాక డోజ్ దాదాపు 3 లక్షల ఉద్యోగాలకు ఎసరుపెట్టింది. ఇప్పుడు ఏఐ కారణంగా వేలాది ఉద్యోగాలు ప్రతీ నెలా కోతలు పడుతున్నాయి. దీంతో అమెరికాతో యూత్ అల్లాడిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్ ముందు జాగ్రత్తగా విదేశీయులకు ముకుతాడు వేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications