Anthropic and OpenAI: మతం సాయం కోరుతున్న ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ- రీజన్ ఇదే..!
కృత్రిమ మేధస్సు (AI) దిగ్గజాలైన ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ అధికారులు తాజాగా న్యూయార్క్‌లో హిందూ, సిక్కు మత పెద్దలను కలుసుకున్నా. ఏఐ వ్యవస్థలలో నైతిక విలువలను ఎలా పెంపొందించాలి అనే విషయంపై చర్చించడమే ఈ రౌండ్‌టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, దాని నైతికతపై పెరుగుతున్న ఆందోళనల దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది.
కృత్రిమ మేధ కోడ్‌ను రాయగలదు, క్లిష్టమైన లెక్కలను చేయగలదు, ఇంకా అనేక పనులను స్వయంగా పూర్తి చేయగలదు. అయితే, సరైనది ఏమిటి, తప్పు ఏమిటి అని ఇంకా అర్థం చేసుకోలేదు. ఈ లోపాన్ని సరిదిద్దడానికి, ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ వంటి ఏఐ సృష్టికర్త సంస్థలు తమ మోడళ్లకు నైతిక విలువలను నేర్పడానికి కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే వివిధ మత సమూహాల నాయకులతో చర్చలు జరిగాయి. గత వారం న్యూయార్క్‌లో జరిగిన "ఫెయిత్-AI కావెనెంట్" రౌండ్‌టేబుల్ ప్రారంభ సమావేశంలో ఈ రెండు AI సంస్థల (Anthropic and OpenAI ) కీలక అధికారులు మత పెద్దలను కలిశారు. సాధారణ కృత్రిమ మేధస్సు వైపు పయనిస్తున్న తరుణంలో, ఏఐ మనుషుల్లా ఆలోచించగల స్థాయికి చేరుకున్నప్పుడు దాని నైతికత ఎలా ఉంటుందనే విషయమై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈ చర్చలు జరిగాయి.

ఈ సమావేశానికి నార్త్ అమెరికాలోని హిందూ టెంపుల్ సొసైటీ, బహాయి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ది సిక్కు కూటమి, గ్రీక్ ఆర్థడాక్స్ ఆర్చ్‌డయోసెస్ ఆఫ్ అమెరికా, ఇంకా ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్ (మోర్మాన్ చర్చి) తదితర సంస్థల నాయకులు హాజరయ్యారు. జెనీవా కేంద్రంగా పనిచేసే ఇంటర్‌ఫెయిత్ అలయన్స్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. తీవ్రవాదం, ఛాందసవాదం, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై ఈ సంస్థ పనిచేస్తుంది. ఇది ఒక్కరోజు సమావేశం కాదని, భవిష్యత్తులో బీజింగ్, నైరోబి, అబుదాబిలలో కూడా ఇలాంటి చర్చలు నిర్వహించే ప్రణాళికలు ఉన్నాయని పేర్కొంది. సాధారణంగా సిలికాన్ వ్యాలీ తమ సాంకేతికతకు సంబంధించిన విధానాల విషయంలో వ్యవస్థీకృత మతాల నుండి దూరంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు నైతిక కృత్రిమ మేధను ఎలా సృష్టించాలో అర్థం చేసుకోవడానికి మత సమూహాల సహాయాన్ని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ప్రధానంగా మత పెద్దలు భవిష్యత్ AI మోడళ్ల నైతికతను తీర్చిదిద్దడంలో ఎలా సహాయపడగలరు అనే విషయంపై దృష్టి సారించినట్లు నివేదిక వెల్లడించింది. నిబంధనలతో మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ చొరవలో భాగమైన బారనెస్ జోవన్నా షీల్డ్స్, "ఈ ప్రత్యక్ష సంబంధం చాలా ముఖ్యం. ఎందుకంటే AIని నిర్మిస్తున్నవారు దాని శక్తిని, సామర్థ్యాలను అర్థం చేసుకున్నారు. వారిలో చాలా మంది దీనిని సరైన మార్గంలో చేయాలనుకుంటున్నారు" అని అసోసియేటెడ్ ప్రెస్ కు తెలిపారు.














Click it and Unblock the Notifications