ఏఐ టూల్స్ వేగంగా మింగేస్తున్న ఉద్యోగాలివే..! ఇందులో మీరున్నారా ?
ప్రపంచంలో ఏఐ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకో కొత్త ఏఐ టూల్ రాకతో ఇప్పటివరకూ చూసిన సెర్చ్ ఇంజన్లు, ఇతర సాధనాల విలువే లేకుండా పోతోంది. అలాగే ఇన్నాళ్లూ ఆయా రంగాలపై ఆధారపడిన ఉద్యోగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ దెబ్బకు భారీగా ఉద్యోగాలు ఎగిరిపోతుండగా.. మరికొన్ని తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. కొత్త ఏఐ టూల్స్ నేర్చుకోవడమే దీనికి పరిష్కారమనే వాదన అంతకంతకూ పెరుగుతోంది.
పలు దేశాల్లో ఏఐ టూల్స్ వేగంగా భర్తీ చేసేస్తున్న ఉద్యోగాల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. అయితే ప్రధానంగా కొన్ని ఉద్యోగాలను ఏఐ టూల్స్ వేగంగా భర్తీ చేసేస్తున్నాయి. వీటిలో పునరావృతమయ్యే ఉద్యోగాలతో పాటు డేటా ఆధారిత ఉద్యోగాలు కూడా ఉంటున్నాయి. ప్రతీ పరిశ్రమా ఆటోమేషన్ దిశగా వేగంగా అడుగులేస్తుండమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏఐ టూల్స్ కారణంగా వేగంగా మాయం అవుతున్న ఉద్యోగాల జాబితా ఓసారి పరిశీలిద్దాం..

ఏఐ టూల్స్ రాకతో ప్రస్తుతం ఉన్న రిటైల్ క్యాషియర్లు, ప్రూఫ్ రీడర్లు, కాపీ ఎడిటర్లు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, ఫైనాన్షియల్ అనలిస్టులు, మార్కెట్ రీసెర్చర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, లీగల్ అసిస్టెంట్లు, గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ క్రియేటర్లు, కొన్ని ఐటీ ఉద్యోగాలు వేగంగా భర్తీ అయిపోతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. వీరి స్ధానంలో ఏదో ఒక ఏఐ టూల్ చొచ్చుకు వచ్చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

చాలా సంస్థలు ఏఐ టూల్స్ ను ప్రవేశపెట్టి ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత పెడుతున్నాయి. ఇది ఏ స్ధాయిలో ఉందంటే ఒక్క క్లార్నా ఏఐ టూల్ 700 మందికి సమానమైన పనిచేస్తున్నట్లు తేలింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఏఐ టూల్స్, కేవలం 10 నిమిషాల్లో రచన, కోడింగ్, డిజైన్, వినియోగదారుల సేవలు, వీడియో ఎడిటింగ్ వంటి 10 వేర్వేరు ఉద్యోగాల పనిని పూర్తి చేసేస్తున్నాయి. అయితే ఇంత సంక్షోభంలోనూ అవకాశాలకు మాత్రం కొదవలేదు. ఏఐ ఎంట్రీతో ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఎథిక్స్, క్రియేటివ్ ఏఐ యూసేజ్, ఏఐ సపోర్ట్ స్పెషలిస్ట్ వంటి కొత్త ఉద్యోగాలకు డిమాండ్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications