NEET UG 2024: నీట్ రీఎగ్జామ్ లో మరో ట్విస్ట్ -ఏకంగా సగం మంది గైర్హాజరు.. !
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG 2024) వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈసారి నీట్ పరీక్ష సందర్భంగా తగినంత సమయం దొరకలేదనే కారణంతో గ్రేస్ మార్కులు కలిపిన 1563 విద్యార్ధుల కారణంగా ర్యాంకులు తారుమారు కావడం, ఆ తర్వాత ఎన్టీయే వీరి పరీక్షను రద్దు చేసి రీఎగ్జామ్ పెట్టడం తెలిసిందే. అయితే రీ ఎగ్జామ్ కు ఇందులో దాదాపు సగం మంది హాజరు కాకపోవడం సంచలనంగా మారింది.
నీట్ లో గ్రేస్ మార్కులు పొంది పరీక్ష రద్దయిన 1563 మంది అభ్యర్ధులకు ఎన్టీఏ నిన్న రీఎగ్జామ్ నిర్వహించింది. అయితే వీరంతా తప్పనిసరిగా ఈ పరీక్షకు హాజరవుతారని భావించగా.. దాదాపు సగం మంది (48 శాతం) పరీక్షకు హాజరు కాలేదు. 1563 మందిలో కేవలం 813 మందే పరీక్ష రాశారని, మరో 750 మంది గైర్హాజరు అయినట్లు ఎన్టీఏ తెలిపింది. ఛత్తీస్ ఘడ్, గుజరాత్, హర్యానా, మేఘాలయ, చండీఘడ్ లోని ఏడు కేంద్రాల్లో మూడున్నర గంటల పాటు ఈ పరీక్ష జరిగింది. ఇందులో ఛత్తీస్ ఘడ్ లోని రెండు కేంద్రాల్లో అత్యధికంగా అభ్యర్ధులు గైర్హాజరు అయ్యారు.

నీట్ రీ టెస్ట్ కు అర్హులుగా గుర్తించిన 1563 మందిలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ స్వామి ఆత్మానంద ఉత్క్రిస్ట్ హిందీ మీడియం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుండి 176 మంది అభ్యర్థులు తిరిగి పరీక్షకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు బలోడ్ లోని డీఏవీ ఇస్పాత్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉన్నారు. వీరిలో 115 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
అలాగే హర్యానాకు చెందిన 312 మంది అభ్యర్థులకు ఝజ్జర్‌లోని డిఏవీ పోలీస్ పబ్లిక్ స్కూల్‌ను కేంద్రంగా కేటాయించగా.. వీరిలో 178 మంది అభ్యర్థులు మాత్రమే మళ్లీ పరీక్ష రాశారు. ఝజ్జర్‌లోని కేంద్రీయ విద్యాలయం నుండి 182 మంది అభ్యర్థులు రీటెస్ట్ కు అర్హత సాధించగా 109 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షకు గైర్హాజరు అయ్యే విద్యార్థులకు గతంలో ఇచ్చిన గ్రేస్ మార్కులను మైనస్ చేసి అసలు స్కోర్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్ష హాజరైన వారు మాత్రం రీటెస్ట్ లో సాధించిన స్కోరు ఆధారంగా ర్యాంకులు ఇస్తారు. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పేపర్ లీక్ ఆరోపణలపై 63 మంది అభ్యర్థులు డీబార్ కాగా.. ఇందులో బీహార్‌కు చెందిన 17 మంది, గుజరాత్‌లోని గోద్రాకు చెందిన 30 మంది ఉన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల సంస్కరణ కమిటీ నీట్ పై రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది.












Click it and Unblock the Notifications