10 Days MBA Degree: పదిరోజుల్లో ఎంబీఏ డిగ్రీ ? విద్యార్ధులకు ఏఐసీటీఈ క్లారిటీ ఇదే..!
దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులు, ఉపాధి అవకాశాల్లో మార్పుల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోర్సుల డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇదే క్రమంలో నకీలీ కోర్సుల హల్ చల్ కూడా పెరిగింది. ముఖ్యంగా ఎంబీఏ కోర్సులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని నకిలీ డిగ్రీల హవా కూడా పెరుగుతోంది. భారీగా ఫీజులు చెల్లించి, కోర్సులు పూర్తి చేసి డిగ్రీలు తీసుకున్నాక అవి నకిలీవని తేలడంతో విద్యార్ధుల ఆక్రందన అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఏఐసీటీఈ విద్యార్ధుల్ని అలర్ట్ చేస్తోంది.
దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న నకిలీ ఎంబీఏ ప్రోగ్రామ్‌లపై విద్యార్థులను అప్రమత్తం చేస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తమ నుంచి సరైన అనుమతులు లేకుండా ఏకంగా 10 రోజుల్లో ఎంబీఏ కోర్సు అంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలపై విద్యార్ధుల్ని అలర్ట్ చేసింది. ఇలా 10 రోజుల ఎంబీఏ కోర్సులు ఆఫర్ చేస్తున్న మోటివేషనల్ స్పీకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది.

పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీని 10 రోజుల్లో పూర్తి చేయడం ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని, ఇది అధునాతన నైపుణ్యాలతో విద్యార్థులను సిద్ధం చేయడానికి రూపొందించిన రెండేళ్ల డిగ్రీ కాబట్టి దీనిపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్ధుల్ని ఏఐసీటీఈ హెచ్చరించింది. దేశంలో కొందరు మోటివేషనల్ స్పీకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు 10 రోజుల ఎంబీఎ క్రాష్ కోర్సును అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఏఐసీటీఈ తెలిపింది. అలాంటి క్రాష్ కోర్సు తప్పుదారి పట్టించే ప్రయత్నమే అని తెలిపింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏఐసీటీఈ ఆమోదం లేకుండా ఎంబీఏ లేదా మరే ఇతర మేనేజ్‌మెంట్ కోర్సులు (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు) సహా సాంకేతిక కోర్సులను ఏ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నిర్వహించదని ఈ ప్రకటనలో తెలిపింది. ఎంబీఏ అనేది రెండు సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు అని, అడ్వాన్స్‌డ్ స్కిల్స్, బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్‌లోని వివిధ అంశాలలో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను సన్నద్ధం చేయడానికి దీన్ని రూపొందించబడించినట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications