ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ సీట్లు..! దరఖాస్తులు తేదీ, ఇతర వివరాలివే..!
ఏపీలోని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్ధులకు ఉచిత సీట్లు అందించేందుకు వీలుగా ప్రభుత్వం (ap govt) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని పేద విద్యార్ధులు తమకు స్థానికంగా ఉండే ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఎంచుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వాటిని పరిశీలించి అధికారులు సీట్ల లభ్యత, ఇతర అంశాల ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ ప్రకటించింది.
విద్యా హక్కు చట్టం కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత కోటా సీట్ల ప్రవేశాలకు సమగ్ర శిక్షా అభి యాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు షెడ్యూల్ విడుదల చేశారు. ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈనెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. http://cse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా గాని, గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యావనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు.

రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రవేశాలకు శుక్రవారం ప్రకటన విడుదల చేస్తారు. ఈ నెల 7 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు వివరాలను వెబ్ సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. 20 నుంచి మార్చి 10 వరకు విద్యార్థుల ఆన్ లైన్ వివరాలు నమోదు చేస్తారు. మార్చి 17న గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా ప్రవేశాలకు విద్యార్థుల అర్హత నిర్ధారిస్తారు.

మార్చి 25న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మార్చి 6 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాల ధ్రువీకరణ ఉంటుంది.
అనంతరం ఏప్రిల్ 12న రెండో విడత సీట్ల కేటాయింపు చేపడతారు. ఏప్రిల్ 13 నుంచి 23 వరకు పాఠశాలల ద్వారా విద్యార్థుల ప్రవేశాల ధ్రువీకరణ ఉంటుంది. కాబట్టి ఇందులో సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబరు 18004258599 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications