ఏపీ టెట్, డీఎస్సీ షెడ్యూల్స్ మారతాయా ? గ్యాప్ పై తేల్చనున్న హైకోర్టు..!
ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య అతి కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంపై అభ్యర్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.టెట్ పరీక్షలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకూ నిర్వహిస్తుండగా..మార్చి 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు ఉంటాయి. దీంతో రెండు పరీక్షల మధ్య గ్యాప్ తక్కువగా ఉందన్న అభ్యంతరాల మధ్య హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.వీటిపై హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించనుంది.
రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే డీఎస్సీకి అర్హత సాధించేందుకు టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకూ టెట్ పరీక్ష జరగబోతోంది. దీనికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు ఏకకాలంలో డీఎస్సీకి కూడా ప్రిపేర్ కావాల్సిన పరిస్దితి ఉంది. ఎందుకంటే రెండు పరీక్షల మధ్య గ్యాప్ కేవలం ఐదు రోజులే. మార్చి 15 నుంచి తిరిగి డీఎస్సీ పరీక్షలు ఉండటంతో అభ్యర్ధుల పరిస్దితి అగమ్య గోచరంగా మారింది.

అయితే ప్రభుత్వం ఎన్నికలకు ముందే టెట్, డీఎస్సీ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలు కూడా ప్రకటించాలని పట్టుదలగా ఉండటంతో ఈ పరిస్దితి ఎదురవుతోంది. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయింది. దీంతో ఇవాళ తీర్పు ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం సిద్దమవుతోంది. ఈ తీర్పులో టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య తగినంత వ్యవధి అవసరమని హైకోర్టు భావిస్తే కచ్చితంగా షెడ్యూల్స్ ను మార్చాల్సి ఉంటుంది. అలా కాకుండా రెండు పరీక్షల మధ్య ఐదు రోజుల గ్యాప్ సరిపోతుందని హైకోర్టు భావిస్తే షెడ్యూల్ లో ఎలాంటి మార్పు ఉండదు.












Click it and Unblock the Notifications