దేశంలో ఎక్కడైనా చదువుకోవచ్చు- ఆ రిజర్వేషన్లు చెల్లవన్న సుప్రీంకోర్టు..!
దేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ప్రాంతాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్ని రాజ్యాంగ విరుద్దంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఓ కేసులో ఇలాగే చంఢీఘడ్ కోటా కింద పీజీ మెడికల్ సీట్లకు రిజర్వేషన్ అమలు చేయడాన్ని తప్పుబడుతూ గతంలో పంజాబ్-హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సమర్థించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ఈ దేశ పౌరులు ఎక్కడైనా నివసించవచ్చని, ఎక్కడైనా చదువుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్ధానికత ఆధారంగా పీజీ మెడికల్ సీట్లలో రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు గతంలో పంజాబ్-హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని తోసిపుచ్చింది. దీంతో ఇకపై పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రాంతీయత ఆధారంగా రిజర్వేషన్లు అమలు కావు. ఏ ప్రాంత విద్యార్థి అయినా మరే ప్రాంతంలో అయినా అడ్మిషన్లు పొందేందుకు వీలు కలిగింది.

నీట్ పీజీ కౌన్సిలింగ్ సందర్భంగా చంఢీ ఘడ్ కోటా కింద ఆడ్మిషన్ల కోసం సీట్లను రిజర్వ్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వాటిని వెంటనే ఇతర విద్యార్ధుల కోసం అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. NUG కోర్సుల కోటా మాత్రం రాష్ట్ర నిధుల మౌలిక సదుపాయాల దృష్ట్యా సహేతుకమైనదేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
స్థానిక నివాసితులకు ఎంబీబీఎస్, ఇతర ప్రాథమిక వైద్య కోర్సులకు కొన్ని రిజర్వేషన్లను అనుమతించవచ్చని వెసులుబాటు కల్పించింది. దేశంలోని ఏ ప్రాంతంలో అయినా నివసించే ప్రాథమిక హక్కు ఉన్నట్లే.. భారతీయ పౌరులు ఏదైనా విద్యను కూడా అభ్యసించవచ్చని, అర్హతకు తగిన ఉద్యోగాలను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.












Click it and Unblock the Notifications