ఉద్యోగాలొద్దు, వ్యాపారాలే-75 శాతం విద్యార్ధుల మాట- తాజా సర్వేలో..!
భారత్ లో విద్యార్ధుల ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు ఏఐ కారణంగా ఉద్యోగాల లేఆఫ్ లు పెరిగిపోతుండటం, కొత్త ఉద్యోగాలు వచ్చినా వాటిలోనూ స్దిరత్వం గ్యారంటీ లేకపోవడం వంటి కారణాలు ఇప్పుడు యువత ఆలోచనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూనివర్శిటీ విద్యార్దులపై నిర్వహించిన తాజా సర్వేలో వెలువడిన ఫలితాలు చూస్తే వారి ఆలోచనా విధానం ఎలా ఉందో అర్థమవుతోంది.
భారతీయ విశ్వవిద్యాలయాలలో 1,000 మంది విద్యార్థులు, వ్యవస్థాపకులు,సీఎక్స్ వోలు, పెట్టుబడిదారులు, పర్యావరణ వ్యవస్థ నిపుణులతో సహా 200 మంది పరిశ్రమ నిపుణులపై నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగాల కంటే వ్యాపారాలకే తాము మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు. బీఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీలో తాజాగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఇందులో ఉద్యోగాల కంటే మూడొంతుల మంది వ్యాపారాలకే మొగ్గు చూపారు.

అయితే ఇలా వ్యాపారాలను ప్రారంభించాలని భావిస్తున్న 75 శాతం మంది ఈ క్రమంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మార్గదర్శకుల కొరత అత్యంత ముఖ్యమైన సవాలు అని 35 శాతం మంది విద్యార్థులు తెలిపారు. చట్టపరమైన, ఆర్థిక విషయాలపై మార్గదర్శకత్వం సమస్య అని 24 శాతం, నిధుల పరిమితులు సమస్య అని 22 శాతం విద్యార్ధులు తెలిపారు. వైఫల్య భయం సమస్యగా 13 శాతం విద్యార్దులు చెప్పుకొచ్చారు. చదువుకుంటూ వ్యాపార ప్రయత్నాలు చేయడం సమస్యగా మరో 7 శాతం మంది చెప్పారు.
మరోవైపు నిర్మాణాత్మక బోర్డు సమీక్షలు, పారదర్శక రిపోర్టింగ్ వ్యవస్థలు, నైతిక చట్రాలతో కూడిన వ్యాపారాలు గణనీయంగా అధిక పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందాయని ఈ సర్వేలో తేలింది. పారదర్శకత, సామాజిక ప్రభావం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే రెండు అత్యంత ప్రభావవంతమైన చోదకాలుగా తేల్చారు. తరువాత వ్యవస్థాపక విశ్వసనీయత కూడా ఉందని తేలింది. తర్వాతి తరం బాధ్యతాయుతమైన వ్యవస్థాపకులను రూపొందించడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది.

దాదాపు సగం మంది విద్యార్థులు కంపెనీల ఏర్పాటుకు తమ యూనివర్సిటీల సహకారాన్ని ముఖ్యమైనదిగా చెప్పారు. 89 శాతం మంది నైతికత, ఆర్థిక జవాబుదారీతనంపై కోర్సులను పాఠ్యాంశాల్లోకి చేర్చడానికి మద్దతు ఇచ్చారు. కేవలం 9.6 శాతం మంది మాత్రమే ఇప్పటికే ఉన్న ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌లను అత్యంత ప్రభావవంతంగా గుర్తించారు. మార్గదర్శకత్వం, సామర్థ్య అంతరాలను తగ్గించడానికి విద్యా, పరిశ్రమల మధ్య గ్యాప్ ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.












Click it and Unblock the Notifications