TREIRB results: గురుకుల పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?
హైదరాబాద్: తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఫలితాలు ఆగస్టు నెలాఖరులోగా వెల్లడికానున్నాయి. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడు షిప్టుల చొప్పున రాత పరీక్షలను గురుకులా నియామక బోర్డు నిర్వహించింది.
ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 75.68 శాతం మంది సగటున హాజరైనట్లు బోర్డు కార్యనిర్వహణాధికారి మల్లయ్య భట్టు తెలిపారు. పరీక్షల మాస్టర్ ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు. అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా సమాధానాలు సరి చూసుకోవాలని.. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే గడువు తేదీలోగా తెలపాలని సూచించారు.

అభ్యర్థులు లాగిన్ ఐడీ ద్వారా మాత్రమే తెలపాలని, ఈ-మెయిల్, వ్యక్తిగత, రాతపూర్వక అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఆగస్టు 21, 22,23 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ గురువారం మధ్యాహ్నం తర్వాత నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
కాగా, రాష్ట్రంలో ఆగస్టు 3 నుంచి 19 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాలను గురుకుల నియామక బోర్డు వెబ్‌సైట్‌లోకి వ్యక్తిగత లాగిన్‌లో బుధవారం పొందుపరిచింది. ఈ ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 25 సాయంత్రంలోగా తెలపాలని సూచించింది.
ఇక, ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకుని, పరిశీలించి రెండు రోజుల్లోగా తుది కీలను గురుకుల నియామక బోర్డు ప్రకటించనుంది. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా వివరంగా తెలపనుంది. ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టులకు అవరోహణ క్రమంలో నియామక ప్రక్రియ పూర్తి చేయనుంది. ముందుగా డిగ్రీ, జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీటీ, టీజీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబరు నెలాఖరు నాటికి నియామకాలు పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications