"పెద్ది" విడుదల వేళ శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్.. వీడియో వైరల్ !!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమా విడుదల రోజునే తిరుమలలో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చిన జాన్వీ.. భక్తి భావంతో దర్శనం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా 'పెద్ది' విడుదలకు ఒక రోజు ముందే జాన్వీ కపూర్ తిరుపతికి చేరుకున్నారు. అనంతరం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని తన మొక్కును తీర్చుకున్నారు. ఆమెతో పాటు ప్రముఖ సినీనటి, తన బంధువు అయిన మహేశ్వరి కూడా ఉన్నారు. భక్తులతో కలిసి మెట్ల మార్గంలో నడుస్తూ తిరుమల చేరుకున్న జాన్వీ సాధారణ భక్తురాలిగా కనిపించడం విశేషంగా మారింది.

సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణ..
ఇక ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లిన జాన్వీ కపూర్ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. ముదురు రంగు పట్టుచీర ధరించిన ఆమె, బంగారు కామన్‌పట్టీ, నెక్లెస్, జుంకాలు, గాజులు ధరించి అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది. ఆమె సాంప్రదాయ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భక్తులు, అభిమానులు జాన్వీని చూసేందుకు ఆసక్తి చూపగా, పలువురు సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు.
శ్రీవారి ఆలయంలో గర్భగుడిలోని మూలవిరాట్‌ను దర్శించుకున్న జాన్వీ కపూర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించి హుండీలో కానుకలు సమర్పించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద జాన్వీ కపూర్ శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేయడం భక్తులను ఆకట్టుకుంది. ఆమె భక్తి భావానికి అక్కడున్న భక్తులు ప్రశంసలు కురిపించారు. 'పెద్ది' సినిమా విడుదల సందర్భంగా చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ జాన్వీ కపూర్ స్వామివారి ఆశీస్సులు పొందినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే చిత్ర యూనిట్ సభ్యులు పలువురు వివిధ దేవాలయాలను సందర్శించగా, జాన్వీ కూడా తిరుమలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
'పెద్ది' సినిమా హిట్ అవ్వాలని కాలినడకన తిరుమలకు జాన్వీ కపూర్#JanhviKapoor #Peddi #Tirumala #TirumalaTirupatiDevasthanams #ReelTalk #OIReels #Oneindiatelugu pic.twitter.com/xRi0ksB86x
— oneindiatelugu (@oneindiatelugu) June 4, 2026
పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న 'పెద్ది'..
ఇదిలా ఉంటే 'పెద్ది' చిత్రానికి ఇప్పటికే ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గ్రామీణ నేపథ్యం, క్రీడా స్పూర్తి, బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రాస్‌ఓవర్ అథ్లెట్ పాత్రలో కనిపించారు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి విభిన్న క్రీడల్లో రాణించే యువకుడిగా ఆయన నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇక జాన్వీ కపూర్ .. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 'ధడక్' సినిమాతో సక్సెస్‌ఫుల్ డెబ్యూ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత 'ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'మిల్లి', 'గుడ్ లక్ జెర్రీ' వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే టాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.












Click it and Unblock the Notifications