వెంకీ సినిమాకు కాలేజీలకు హాలిడే ఇవ్వడమేంట్రా
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న మూవీ.. ఆదర్శ కుటుంబం. శ్రీనిధి షెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రఘుబాబు, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్య .. ఇతర కీలక పాత్రల్లో నటించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర చినబాబు ఈ సినిమాను నిర్మించారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతోందీ మచ్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రస్తుతం ఈ ఫిల్మ్ ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్ కూడా లాంచ్ అయింది.
ఊహించని నిర్ణయం
శుక్రవారం రాత్రి హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్ లాంచ్ చేసింది యూనిట్. ఈ సందర్భంగా మల్లారెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదల రోజున మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ పరిధిలో ఉండే అన్ని కాలేజీలు, విద్యాసంస్థలు, యూనివర్శిటీకి సెలవు ప్రకటించింది. మల్లారెడ్డి యూనివర్శిటీ వైస్ ఛైర్పర్సన్, డైరెక్టర్ డాక్టర్ చింతల ప్రీతి రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

మొదటి రోజే సినిమా చూస్తామంటూ
అక్టోబర్ 30న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మొదటి రోజే థియేటర్లలో ఈ సినిమాను చూస్తామని మాటిస్తే ఆ రోజు కళాశాలలకు హాలిడే ఇస్తానని ప్రకటించారు. దీంతో విద్యార్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. మొదటి రోజే సినిమా చూస్తామంటూ అక్కడున్న వందలాదిమంది విద్యార్థులు ముక్తకంఠంతో నినదించారు. దీంతో 30వ తేదీ నాడు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె అక్కడికక్కడే ప్రకటించారు. దీంతో ఆడిటోరియం మొత్తం విద్యార్థుల ఈలలు, కేరింతలతో హోరెత్తిపోయింది.
హాట్ టాపిక్
ప్రీతి రెడ్డి తీసుకున్న నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై హాట్ టాపిక్ అయింది. డిబేట్ కు దారి తీసింది. ఒక సినిమా విడుదల నాడు ఏకంగా కాలేజీలకు సెలవు ఇవ్వాలనే నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇటువంటి నిర్ణయాలు విద్యావ్యవస్థను ప్రభావితం చేస్తాయని, మున్ముందు ఇదొక సంప్రదాయంగా మారే ప్రమాదమూ లేకపోలేదనే వాదనలు ఉన్నాయి.
రాజకీయాలు, సినిమాలు, విద్యావ్యవస్థ
రాజకీయాలు, సినిమాలు, విద్యావ్యవస్థ.. వీటన్నింటినీ వేటికవే వేరుగా చూడాల్సిన ఉన్నప్పటికీ.. కలెక్షన్ల కోసం వేలాదిమంది విద్యార్థుల విద్యా భవిష్యత్ ను పణంగా పెట్టడం సరికాదని అంటున్నారు. ఓ సినిమా విడుదలయ్యే రోజున ఏకంగా విద్యాసంస్థలను మూసివేసి సెలవు ఇవ్వడం ఎంతవరకు సమంజసమనే తీవ్రమైన ప్రశ్నలు నెటిజన్ల నుంచి వ్యక్తమౌతున్నాయి. ఇటువంటి నిర్ణయాలు ప్రతికూల సంకేతాలను పంపుతాయని, దీనివల్ల విద్యార్థులలో క్రమశిక్షణ కొరవడుతుందని అభిప్రాయపడుతున్నారు.
వసూళ్లను పెంచుకోవడానికి
ఏపీలో ఇప్పటికే రాజకీయాలు, సినిమా ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడిపోయాయనే విమర్శలు బలంగా వినిపిస్తోన్నాయి. ఇప్పుడు ఆ ప్రభావం ఏకంగా విద్యావ్యవస్థపై కూడా నేరుగా పడటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. సినిమా వసూళ్లను పెంచుకోవడానికి, అభిమానాన్ని బహిరంగంగా చాటుకోవడానికి వేలాది మంది విద్యార్థుల విలువైన చదువు, విద్యా క్యాలెండర్ను పక్కన పెట్టడం ఎంతమాత్రం తగదని సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
థియేటర్ల వైపు మళ్లించేలా ప్రోత్సహించడం
భవిష్యత్తులో ఇతర పెద్ద సినిమాలకు కూడా ఇదే రకమైన వెసులుబాటు ఇవ్వాలనే ఒత్తిళ్లు, డిమాండ్లు వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి చర్యలు విద్యావ్యవస్థలో ఒక తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతాయని హెచ్చరిస్తున్నారు. క్రమశిక్షణతో తరగతులకు హాజరుకావాల్సిన సమయంలో విద్యార్థులను థియేటర్ల వైపు మళ్లించేలా ప్రోత్సహించడం వారి విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు.
విద్యావ్యవస్థలో అనవసర జోక్యాలు
విద్యాసంస్థల ప్రాథమిక లక్ష్యం నాణ్యమైన విద్యను అందించడం, విద్యార్థులలో జ్ఞానాన్ని పెంపొందించడం మాత్రమే కావాలని వారు తేల్చి చెబుతున్నారు. కళాశాలల నిర్వహణలో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అకాడమిక్ ప్రయోజనాలకే అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇకనైనా విద్యావ్యవస్థలో ఇటువంటి అనవసర జోక్యాలు, సంప్రదాయాలకు స్వస్తి చెప్పి, తరగతుల నిర్వహణను సక్రమంగా కొనసాగించేలా సంబంధిత అధికారులు, యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పలు వర్గాలు కోరుతున్నాయి.















Click it and Unblock the Notifications
