ఏపీ తీరానికి ఆర్ణబ్ తుఫాన్- రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు: మత్స్యకారులకు సూచనలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తోన్నాయి. ఈదురుగాలులు, పిడుగులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో తరచూ వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైన సందర్భాలు లేకపోలేదు. దక్షిణ కోస్తా వర్షాల తీవ్రత ఒకింత అధికంగా నమోదవుతోంది.
ఇవే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది ఈ సాయంత్రానికి లేదా ఆదివారం నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాన్ గా రూపాంతరం చెందడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనికి భారత వాతావరణ కేంద్రం ఆర్ణబ్ గా పేరు పెట్టింది.

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు- మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ వాయుగుండం.. క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి తుఫాన్ బలపడుతుందని పేర్కొంది. ఈ నెల 28వ తేదీన ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రత్యేకించి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.
నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చు. శని, ఆదివారాల్లో ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వివరించారు. సోమవారం నాడు తుఫాన్ గా మారే అవకాశం ఉన్నందున ఆ రోజు నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
ఆ సమయంలో తీరం వెంబడి 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రంపై చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిడుగులు పడుతున్నప్పుడు గానీ, ఈదురుగాలులు వీస్తున్నప్పుడు శిథిల నివాసాలు, గోడలు, చెట్లు, హోర్డింగుల కింద తలదాచుకోవద్దని ప్రఖర్ జైన్ సూచించారు.













Click it and Unblock the Notifications
