ఓటీటీలోకి తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10 న విడుదలైన ఈ మూవీ సాలిడ్ వసూళ్లను రాబట్టింది. కంటెంట్ బలంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన మూడు వారాలపాటు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపిన ఈ మూవీని ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. లవ్ స్టోరీతోపాటు యాక్షన్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. మే 8 న 'డెకాయిట్' మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'డెకాయిట్' మూవీ తెలుగుతో పాటుగా హిందీ, ఇంకా ఇతర పాన్ ఇండియా భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ మూవీ మిస్ అయినవారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హరిదాస్(అడివి శేష్) 13 ఏళ్లుగా జైలులో ఉంటాడు. ఓ సారి పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. జైలు నుంచి బయటకు వచ్చిన హరిదాస్.. తన జీవితాన్ని నాశనం చేసిన మాజీ ప్రేయసి అలియాస్ సరస్వతి(మృణాల్ ఠాకూర్) పై పగ తీర్చుకోవాలని కసిగా ఉంటాడు. మరోవైపు సరస్వతి జీవితం అప్పటికే పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటాడు. అతడికి ఆపరేషన్ చేయాలంటే చాలా డబ్బు కావాలి.

అయితే ఈ విషయం తెలుసుకున్న హరిదాస్.. తన ప్లాన్ ను సాధించడం కోసం ఏం చేస్తాడు..? సరస్వతికి ఎలా దగ్గరవుతాడు..? గతంలో వాళ్లు ఎందుకు విడిపోయారు..? చివరికి ఏం జరిగింది..? అనేవి కథలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, సునీల్, కామాక్షి భాస్కర్ల, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక డెకాయిట్ మూవీకి షానియల్ డియో దర్శకత్వం వహించాడు. భీమ్స్ సంగీతం అందించాడు. సుప్రియ యార్లగడ్డ నిర్మాణం వహించారు.












Click it and Unblock the Notifications