ఆరోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈరోజు నీవెంటే.. అర్థమైందా నాగార్జున?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీదకు గన్ గురిపెట్టగా అది గురితప్పి నాగార్జున కుటుంబంపైకి వెళ్లింది. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, సమంతకు క్షమాపణలు చెబుతున్నామని మంత్రి సురేఖ ప్రకటించారు. అయినా సినీ పరిశ్రమ యావత్తూ సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. పరిశ్రమ మొత్తం ఒకేమాటపై నిలిచింది. అక్కినేని నాగార్జునకు, నాగార్జున కుటుంబానికి మద్దతు ప్రకటించింది. దీనిపై సినీ పరిశ్రమలో ఉన్న ఐకమత్యం బయటపడింది.
టికెట్ ధరలతో ఇబ్బంది లేదన్న నాగార్జున
అయితే ఒకానొక సమయంలో ఇండస్ట్రీని నాగార్జున ఒక విషయంలో పట్టించుకోలేదు. తన స్వలాభం చూసుకున్నారు. అందుకు కారణం ఏపీలో తన స్నేహితుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండటమే. జగన్ హయాంలో సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోనివ్వకుండా తక్కువ ధరలను ఖరారు చేసి అవి అమలయ్యేలా అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించిన జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో నాగార్జున సినిమా విడుదలవుతోంది. దీనిపై విలేకరులు ప్రశ్నించగా ఆ టికెట్ ధరలతో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, తన సినిమాకు ఓకే అని నాగార్జున సమాధానమిచ్చారు. టికెట్ ధరలపై సినీ పరిశ్రమ మొత్తం ఇబ్బంది పడుతున్న సమయంలో నాగార్జున స్పందించలేదు. ఎటువంటి చొరవ చూపలేదు. తనదారి తనదే అనేరీతిలో ఉన్నారు.

పాత వీడియో వైరల్
సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు గతంలో నాగార్జున మాట్లాడిన ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని, వినోదం ఖరీదుగా మారిందంటూ నానా యాగీ చేసిన సందర్భంలో నాగార్జున వీసమెత్తు స్పందించలేదు. అదే విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీ స్వార్థం మీరు చూసుకున్నప్పటికీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం క్షమించరానివనే ఉద్దేశంతో పరిశ్రమ యావత్తూ మీవైపు నిలబడి మద్దతు తెలియజేసిందని, సురేఖపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తాను ఎప్పుడూ చాలా బలమైన వ్యక్తిని అని అనుకుంటానని, తన కుటుంబ రక్షణ విషయంలో తానొక సింహాన్ని అని, అదృష్టవశాత్తూ తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తమవెంటే నిలబడిందని, అందుకు కారణం మా నాన్నగారి గొప్పతనం, ఆయన ఆశీస్సులుగా భావిస్తున్నానంటూ నాగార్జున ట్విటర్ లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications