ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి సౌండ్ చేసేలా ఉందే..!
తెలుగు వెండితెరపై అడవి నేపథ్యంగా సాగే సినిమాలు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తాయి. ఆ కోవలోనే ఇప్పుడు 'అమరం' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇది కేవలం ఓ యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. తూర్పు కనుమల సాక్షిగా ఎర్రచందనం స్మగ్లర్ల జీవితాలను, ఆ ప్రపంచంలోని చీకటి కోణాలను కళ్లకు కట్టేలా చూపే ఓ సామాజిక వాస్తవికత కలిగిన చిత్రం. ఓ గిరిజన స్మగ్లర్, ఓ కిల్లర్, ఓ యువతి.. ఈ ముగ్గురి భిన్నమైన ప్రయాణాల చుట్టూ దర్శకుడు కథను ఎంతో ఉత్కంఠభరితంగా మలిచారు.
యాక్షన్ హీరోగా తేజేష్ రాజన్ మెరుపులు
ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయమవుతున్న తేజేష్ రాజన్ తొలి చిత్రంతోనే భారీ ఇంపాక్ట్ చూపించేలా కనిపిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆయన ప్రదర్శించిన పరిణతి సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా కొడైకెనాల్‌లోని ప్రమాదకరమైన 'డాల్ఫిన్ నోస్' పర్యాటక ప్రాంతంలో ఒక క్లిష్టమైన సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో పూర్తి చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. బాంబేకు చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుల పర్యవేక్షణలో, మాస్టర్ మిరాకిల్ మైఖేల్ రూపొందించిన మూడు భారీ యాక్షన్ బ్లాకులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

టాప్ క్లాస్ టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు రాఘవ లారెన్స్ శిష్యుడైన తిరువరుల్ కృష్ణన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మెలోడీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మిక్కీ జే మేయర్.. ఈ సినిమా కోసం తన పంథాను మార్చుకుని పవర్‌ఫుల్ ఫోక్ సాంగ్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. దీనికి తోడు 'వడచెన్నై', 'అసురన్' వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన రామర్ ఈ సినిమా బాధ్యతలు చేపట్టడం విశేషం. బూపతి మాస్టర్ కొరియోగ్రఫీలో కేరళ డ్యాన్సర్లతో కొడైకెనాల్‌లో చిత్రీకరించిన ఫోక్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కడప అడవుల సెట్టింగ్.. లోతైన ప్రేమకథ
సినిమాలో సహజత్వం కోసం కడప పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం అడవులను తలపించేలా భారీ సెట్స్ నిర్మించారు. హీరోయిన్‌గా ఐరా అగర్వాల్ నటించగా.. నాగినీడు, సాయి ధీనా వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఒక జంట, ఊహించని పరిస్థితుల్లో ఒక ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో ఎదురయ్యే మలుపులు, భావోద్వేగపూరితమైన ప్రేమకథ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలుస్తోంది.
బాక్సాఫీస్ విజేతగా నిలిచేనా?
ప్రస్తుతం విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో భారీ ఇంపాక్ట్ సృష్టించింది. సిట్యువేషనల్ యాక్షన్, లోతైన ఎమోషన్స్ ఇష్టపడే ప్రేక్షకులకు 'అమరం' ఒక మంచి విందు భోజనంలా ఉండబోతోంది. టెక్నికల్ వాల్యూస్, కథలో ఉన్న బలం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గట్టి సౌండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications