ఆ ఊరిలో దీపావళి చేసుకోరు.. వందల ఏళ్లుగా అదే భయం!
దేశమంతటా కోటి దివ్వెల వెలుగులతో, బాణాసంచా సవ్వడులతో ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకుంటుంటే.. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామం మాత్రం ప్రతి ఏటా చీకట్లోనే గడుపుతోంది. హమీర్‌పూర్ జిల్లా ప్రధాన కేంద్రానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'సమ్మూ' గ్రామంలో శతాబ్ధాలుగా దీపావళి సంబరాలు జరుపుకోకపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఓ సతి ఇచ్చిన శాపం కారణంగానే తాము ఈ పండుగకు దూరంగా ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.
శతాబ్ధాల నాటి విషాదం.. సతి శాపం
గ్రామ ఉప సర్పంచ్ వీణాదేవి, స్థానిక ప్రజలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొన్ని వందల ఏళ్ల క్రితం దీపావళి పండుగ రోజున ఓ గర్భిణి తన నివాసంలో వేడుకలకు సిద్ధమవుతోంది. సరిగ్గా అదే సమయంలో స్థానిక రాజు సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్న ఆమె భర్త యుద్ధంలో మరణించాడనే వార్తతో పాటు ఆయన మృతదేహం గ్రామానికి చేరుకుంది. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. భర్త చితిపై పడి సతీసహగమనం చేసింది. ప్రాణాలు విడిచేముందు ఆమె గ్రామానికి ఓ శాపం ఇచ్చింది. 'ఈ గ్రామంలో ఎవరూ ఎప్పటికీ దీపావళి పండుగను జరుపుకోలేరు.ఒకవేళ జరుపుకోవడానికి ప్రయత్నిస్తే వారికి విపత్తు తప్పదు" అని ఆ సాధ్వి శపించింది.

పొరపాటున పండుగ జరుపుకుంటే.. నిప్పుతో చెలగాటమే!
ఈ శాపం ఎంత పవర్‌ఫుల్ అంటే.. ఊరిలో ఎవరైనా పొరపాటున పండుగ వేడుకలు చేసుకోవడానకి లేదా బాణాసంచా కాల్చడానికి ప్రయత్నిస్తే, ఆ ఇంట అగ్ని ప్రమాదాలు జరగడం, వింత రోగాలు రావడం లేదా కుటుంబంలో ఎవరైనా మరణించడం జరుగుతుందని గ్రామపెద్ద ఠాకూర్ బిధి చంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాప నివారణార్థం మూడేళ్ల క్రితం గ్రామస్థులంతా కలిసి పెద్ద ఎత్తున మహా యజ్ఞం, హవనాలు నిర్వహించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని స్థానికుడు విజయ్ కుమారుడు వెల్లడించారు.
పండుగ నాడు ఇళ్లలోనే గ్రామస్తులు
శాపాన్ని అధిగమించలేమని గ్రహించిన గ్రామస్తులు పండుగ రోజుల కేవలం మట్టి ప్రమిదలు వెలిగించి సతికి దండం పెట్టుకోవడం తప్ప ఎలాంటి ఆర్భాటాలకు పోరు. బాణాసంచా కాల్చడం, స్వీట్స్ పంచుకోవడం వంటివి పూర్తిగా మానేశారు. భయం కారణంగా పండుగ రోజున చాలా మంది గ్రామస్తులు ఇళ్ల పరిమితులకే పరిమితమై బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. దేశమంతా వెలుగులతో కాంతులీనే వేళ.. హిమాచల్ ప్రదేశ్ లోని ఈ కుగ్రామం మాత్రం భయం, శతాబ్ధాల నాటి విశాద జ్ఞాపకాల మధ్య చీకట్లోనే ఉండిపోతోంది.














Click it and Unblock the Notifications
