26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆ సినిమాలో మేజర్ ఇక్బాల్‌గా నటించిన అర్జున్ రాంపాల్.. 2008 ముంబై దాడులకు సంబంధించిన తన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో నటించడం తనకు కేవలం వృత్తిపరమైన బాధ్యత మాత్రమే కాదని.. 17 ఏళ్ల నాటి తన వేదనకు తీర్చుకున్న ప్రతీకారం అని ఆయన పేర్కొన్నారు.
ఆ బర్త్‌డేను మర్చిపోలేను..
ఇటీవల ముంబైలో జరిగిన "హలో! ఆల్ ఆఫ్ ఫేమ్" అవార్డుల వేడుకలో అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. నవంబర్ 26 తన పుట్టినరోజు అని గుర్తు చేసుకున్నాడు. 2008లో జరిగిన సంఘటనను అర్జున్ రాంపాల్ గుర్తు చేసుకున్నారు. " నా బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం 2008లో మేమంతా తాజ్ హోటల్‌కు వెళ్లాల్సి ఉంది. నా ఫ్రెండ్ ఒకరు రెడీ అవ్వడం ఆలస్యం కావడంతో మేము హోటల్ బార్‌లో ఆగాం. సరిగ్గా అదే సమయంలో బాంబు పేలుడు శబ్ధం వినిపించింది. హోటల్ అద్దాలన్నీ కదిలిపోయాయి. ఆ ఫ్రెండ్ ఆలస్యం చేయడం వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను" అని అర్జున్ రాంపాల్ భావోద్వేగానికి లోనయ్యారు.

17 ఏళ్ల నిరీక్షణకు దక్కిన అవకాశం
ఆ మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లినప్పుడు రోడ్డుపై కనిపించిన మారణహోమం చూసి తాను తట్టుకోలేక పోయానని.. 3 సార్లు కారు ఆపి అనారోగ్యానికి గురయ్యానని అర్జున్ రాంపాల్ వెల్లడించారు. ఆ గాయం తన మనసులో 17 ఏళ్లగా అలాగే ఉండిపోయిందని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ తనకు ధురంధర్ కథలో 26/11 సీన్ గురించి చెప్పగానే.. ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికిందని అర్థమైందంటూ అర్జున్ రాంపాల్ వివరించారు. ఆ సీన్‌లో చూపించిన ఆవేశం, ఆవేదన అంతా తన నిజ జీవిత అనుభవం నుంచి వచ్చాయని అర్జున్ రాంపాల్ పేర్కొన్నారు.
బాక్సాఫీస్ వద్ధ ధురంధర్ ప్రభంజనం
మార్చి 19న విడుదలైన ధురంధర్ సినిమా కేవలం 4 రోజుల్లోనే 400 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్ మధ్య జరిగే ఫైటింగ్ సన్నివేశం ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications