ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమంటున్న రాజమౌళి..!
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి వరకు కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొట్టారు. తన రికార్డులను తానే బద్దలు కొడుతూ తనకు తానే సాటి అనేలా నిలిచారు. ఇక బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో "వారణాసి" మూవీ చేస్తున్నారు.
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా మహేష్ బాబు ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

కాగా తన ఫిల్మ్ కెరీర్ లో ఎంతో మంది నటీనటులతో పనిచేశారు జక్కన్న. అయితే ఆయనకు అత్యంత ఇష్టమైన హీరోయిన్ ఎవరనే విషయంపై గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టాక్ షోలో యాంకర్ ఇండస్ట్రీలో మీ 'ఫేవరెట్' హీరోయిన్ ఎవరని ప్రశ్నించగా.. రాజమౌళి ఏమాత్రం తడబడకుండా అనుష్క శెట్టి పేరు చెప్పారు. "హీరోయిన్లలో నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. ఆమెలోని సిన్సియారిటీ, డెడికేషన్, ప్రొఫెషనలిజం నాకు బాగా నచ్చుతాయి" అని వివరించారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' సినిమాలో అనుష్క కథానాయికగా నటించగా, ఆ తర్వాత 'బాహుబలి' సిరీస్‌లో దేవసేనగా ఆమె చేసిన నటన యావత్ భారతదేశాన్ని మెప్పించింది. అలానే అనుష్కతో పాటు 'మగధీర'లో నటించిన కాజల్, 'మర్యాద రామన్న' చిత్రాల్లో నటించిన సలోని గురించి కూడా ప్రస్తావించారు. ఇక "మీ ఫేవరెట్ హీరో ఎవరు?" అని ప్రశ్నించగా.. రాజమౌళి తనదైన శైలిలో "నా ఫేవరెట్ హీరో ఎవరో పబ్లిక్‌గా చెప్పేంత అమాయకుడిని కాదండి" అంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications