పెళ్లి కాకుండానే తల్లినవుతా.. అది నా ఇష్టం!
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు 'కట్టప్ప'గా సుపరిచితుడైన సత్యరాజ్ కూతురిగా దివ్య సత్యరాజ్ అందరికీ తెలుసు. అయితే ఆమె కేవలం వారసురాలిగానే కాకుండా.. ఓ ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్‌గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం డీఎంకే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమె.. సమాజంలో మహిళల స్వేచ్ఛ, హక్కుల గురించి నిరంతరం గొంతుక వినిపిస్తున్నారు.
పెళ్లి వ్యవస్థపై సెన్సేషనల్ కామెంట్స్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్య.. సంప్రదాయ పెళ్లి వ్యవస్థపై తనకు నమ్మకం లేదని కుండబద్దలు కొట్టారు. తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాలను తాను విశ్వసించనని పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఇష్టపడితే కలిసి ఉండడానికి పెళ్లి అనే అధికారిక ముద్ర అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రేమికులు ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదని.. ఎవరి ఇంట్లో వారు ఉంటూనే బంధాన్ని కొనసాగించవచ్చని ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.

పెళ్లి లేకుండానే తల్లి కావాలని..
ఈ ఇంటర్వ్యూలో అత్యంత వివాదాస్పదమైన, చర్చనీయాంశమైన విషయం .. పిల్లల గురించి ఆమె చేసిన కామెంట్స్. "పెళ్లి చేసుకుంటేనే పిల్లలను కనాలనే నిబంధనను నేను ఒప్పుకోను. వివాహం చేసుకోకుండానే తల్లిని కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని దివ్య సత్యరాజ్ స్పష్టం చేశారు. మాతృత్వం అనేది ఓ మహిళ వ్యక్తిగత నిర్ణయమని, దానికి సామాజిక కట్టుబాట్లతో సంబంధం ఉండకూడదని ఆమె తన బోల్డ్ స్టేట్‌మెంట్‌తో తెలియజేశారు.
జాతకాలు, దేవుడిపై నమ్మకంపై స్పష్టత
తన తండ్రి సత్యరాజ్ నాస్తిక భావజాలం తనపై కూడా ఉందని దివ్య వెల్లడించారు. తనకు జాతకం లేదని, దానిపై నమ్మకం కూడా లేదని గర్వంగా చెప్పారు. "మా నాన్నకు దేవుడిపై నమ్మకం లేదు, అందుకే నాకు జాతకం రాయించలేదు" అని తెలిపారు. ఆధునిక కాలంలో మూఢనమ్మకాల కంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు.
ప్రేమ వైఫల్యం, తండ్రి మద్దతు
తన గతంలోని ప్రేమ వైఫల్యం గురించి కూడా దివ్య ఎమోషనల్‌గా మాట్లాడారు. తాను ప్రేమలో విఫలమైనప్పుడు ఒంటరిగా ఏడ్చానని, కానీ తన తల్లిదండ్రుల ముందు ఆ బాధను ప్రదర్శించలేదని చెప్పారు. తన తండ్రి సత్యరాజ్ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని.. తాను పెళ్లి చేసుకున్నా లేకపోయినా ఆయన తన నిర్ణయాన్ని గౌరవిస్తారని దివ్య గర్వంగా చెప్పుకొచ్చారు. ఒక ప్రోగ్రెసివ్ తండ్రిగా సత్యరాజ్ తనను పెంచిన తీరు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications