టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన దువ్వాడ మాధురి.. వెరైటీ టైటిల్ ఇదే !!
తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ మాధురి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా రీల్స్, వ్యక్తిగత జీవితం, వివాదాలు... ఇలా అనేక కారణాలతో ప్రజల్లో గుర్తింపు పొందిన ఆమె.. ఇప్పుడు తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తూ వెండితెరపై అడుగుపెడుతోంది. ఒకప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచిన మాధురి, ఇప్పుడు నటిగా తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది.
కాగా మాధురి పేరు ఎక్కువగా వినిపించడానికి ప్రధాన కారణం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో ఉన్న అనుబంధమే. ఈ సంబంధం కారణంగా ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలో వారి వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో మాధురికి విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఈ పరిణామాల వల్ల ఆమెపై విమర్శలు వచ్చినప్పటికీ.. అదే సమయంలో ఆమెకు భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.

బిగ్‌బాస్ జర్నీ..
వివాదాల మధ్యే మాధురి బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. అక్కడ ఆమె ప్రవర్తన, గేమ్ ఆడిన విధానం కొంతమేరకు పాజిటివ్ ఇమేజ్‌ను తీసుకువచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన నెగటివిటీని తగ్గించుకోవడంలో బిగ్‌బాస్ ఆమెకు సహాయపడిందనే చెప్పాలి. ఆ షో తర్వాత బుల్లితెరపై కూడా ఆమె కనిపిస్తూ తన పాపులారిటీని కొనసాగించారు.
వెండితెరపై ఎంట్రీ..
ఇక ఇప్పుడు మాధురి నటిగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె తొలి సినిమా "చీన్ టపాక్ డుం డుం" అనే వినూత్నమైన టైటిల్‌తో తెరకెక్కుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన డైలాగ్‌ను టైటిల్‌గా పెట్టడం వల్ల ఈ చిత్రం మొదటి నుంచే చర్చనీయాంశమైంది. అలానే ఈ సినిమాలో మాధురి "గైరమ్మత్త" అనే పవర్‌ఫుల్, గంభీరమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మూవీ యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ ఫోటో చూస్తే ఈ పాత్ర కథలో కీలకంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. మాధురి లుక్‌కు మంచి స్పందన రావడం కూడా సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, బ్రిగిడా సాగా హీరోయిన్‌గా కనిపించనున్నారు. వైఎన్ లోహిత్ దర్శకత్వంలో, శ్రీను నాగులపల్లి నిర్మాణంలో "విలేజ్ టాకీస్" బ్యానర్‌పై సినిమా రూపొందుతోంది. ఇక సినిమా ప్రారంభోత్సవానికి గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, వశిష్ఠ వంటి ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నర్సీపట్నం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి క్లాసికల్ డాన్సర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టిన మాధురి.. తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి "వకుళ సిల్క్స్" పేరుతో వ్యాపారం కూడా నిర్వహించారు. ఇప్పుడు నటిగా మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుండడం పట్ల ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి "చీన్ టపాక్ డుం డుం" సినిమాతో మాధురి నటిగా నిరూపించుకుంటుందా ? లేక మరో ప్రయోగంగా మిగిలిపోతుందా? అన్నది విడుదల తర్వాతే స్పష్టమవుతుంది.












Click it and Unblock the Notifications