బాలయ్యతో విభేదాలపై ఓపెన్ అయిన జూనియర్ ఎన్టీఆర్
నందమూరి బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ మధ్య సత్సంబంధాలు లేవనే విషయం తెలిసిందే. ఈ నందమూరి హీరోలు ఒకే వేదికపై కనపడి సంవత్సరాలవుతోంది. 1999 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైంది. ఆ తర్వాత తారక్ కూడా పార్టీకి, నందమూరి కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు వీరు దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
జగపతిబాబు తారక్ ను అడిగారు
జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలు, చంద్రబాబు జైలు జీవితం, భువనేశ్వరిపై వ్యాఖ్యలు తదితరాలపై తారక్ కానీ, కల్యాణ్ రామ్ కానీ అస్సలు స్పందించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిన ఘటన కూడా వీరి మధ్య విభేదాలున్నాయనేదానికి ఆస్కారం కల్పించింది. తారక్ తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమా చేశారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటించారు. సినిమా షూటింగ్ జరిగే సమయంలో జగపతిబాబు తారక్ ను అడిగారు.. బాలయ్యతో విభేదాలున్నాయా? ఎందుకు అని. అయితే దానికి తారక్ బదులిచ్చారు.

తనకు తండ్రిలాంటివాడితో గొడవలేంటి?
తన తండ్రి హరికృష్ణకు బాలయ్య తమ్ముడని, తనకు తండ్రిలాంటివాడని, అటువంటి వ్యక్తితో గొడవలేముంటాయని, జరిగేదంతా ఉత్తి ప్రచారమేనని తేల్చారు. సరిగ్గా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు వెల్లడించారు. బయట జరుగుతుందతా ప్రచారమేనని, వారిమధ్య ఎటువంటి గొడవల్లేవన్నారు. ప్రస్తుతం బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ హీరోగా సినిమాను సిద్ధం చేస్తున్నారు. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ ను సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. మోక్షజ్ఞకు పోటీగా ఎన్టీఆర్ ను దింపుతున్నారంటున్నారు. ఈ ఇద్దరు వారసుల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications