వాణిజ్య LPG సిలెండర్ పై జీఎస్టీ తగ్గింపు ? ఏపీ హోటళ్ల డిమాండ్ ..!
అమెరికా-ఇరాన్ వార్ ను సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో వాణిజ్య ఎల్పీజీ సిలెండర్ల (Commercial LPG Cylinders) ధరల్ని పెంచుకుంటూ వెళ్లింది. యుద్దం ఆగిపోయాక కూడా ఈ పెంపును పూర్తిగా ఉపసంహరించుకోలేదు. ఇప్పటికే వీటిపై జీస్టీ మోత ఎక్కువగా ఉంది. ఇవన్నీ కలిసి సాధారణ ప్రజలు హోటళ్లవైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే పరిస్ధితులు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ తాజాగా పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసింది.
ఆతిధ్య రంగాన్ని ప్రభావితం చేస్తున్న వాణిజ్య సిలెండర్లపై జీఎస్టీని తగ్గించాలని కోరుతూ హోటళ్ల సంఘం పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కోరింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆతిధ్య రంగం తాజా రేట్ల పెరుగుదల, జీఎస్టీ మోతతో మూతపడే స్దితికి చేరుకుంటోందని వారు తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వాణిజ్య సిలెండర్లపై జీఎస్టీని తగ్గించే విధంగా కేంద్రాన్ని కోరాలని వారు నాదెండ్లకు వినతిపత్రం ఇచ్చారు.

మరోవైపు ఆతిధ్య రంగానికి జీఎస్టీ విధానం కింద గతంలో ఇచ్చిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను పునరుద్ధరించాలని కూడా హోటళ్ల అసోసియేషన్ కోరింది. ఐటీసీ ఉపసంహరణ వల్ల హోటళ్ల నిర్వహణ ఖర్చులు, మూలధన పెట్టుబడి వ్యయాలు గణనీయంగా పెరిగాయని, ఇది ఈ రంగాన్ని పోటీతత్వం లేకుండా చేసి, వ్యాపారాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆరోపించారు.
దీనిపై కేంద్రం జోక్యం కోరాలని మంత్రిని హోటళ్లు కోరాయి. ఈ డిమాండ్లను పరిశీలించి, తగిన స్థాయిలో చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ వారికి హామీ ఇచ్చారు.














Click it and Unblock the Notifications