మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ
వైవిధ్యమైన నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని.. తాజాగా మరో విలక్షణ పాత్రతో మన ముందుకు వచ్చారు. ఆయన లీడ్ రోల్‌లో నటించిన 'కార్మేని సెల్వం' చిత్రం మధ్యతరగతి మనుషుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇవాళ మీడియా షో అనంతరం ఈ సినిమా టాక్ ఎలా ఉంది? సముద్రఖని మరోసారి మెప్పించారా? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ
చెన్నైలో ఒక మిడిల్ క్లాస్ డ్రైవర్‌గా పనిచేసే సెల్వం (సముద్రఖని) కథ ఇది. తన భార్య శాంతి (లక్ష్మీ ప్రియ), కొడుకు బాలుతో కలిసి ఉన్నంతలో సంతోషంగా జీవించే వ్యక్తి. అయితే, సమాజంలో చిన్నచూపు పడకూడదనే భార్య పౌరుషం, ఆ పౌరుషం కోసం దాచుకున్న డబ్బును, పుస్తెల తాడును ఖర్చు చేయడం.. సెల్వం జీవితంలో చిచ్చు రేపుతుంది. కొడుకు వైద్యం కోసం చేసిన అప్పు తీర్చడానికి తన బాస్ (గౌతమ్ మీనన్) కారునే అద్దెకు తిప్పడం మొదలుపెడతాడు సెల్వం. డబ్బుపై పెరిగిన ఆశ అతనిని ఎలాంటి ప్రమాదంలోకి నెట్టింది? తన ఫ్యామిలీని వదిలి పరాయి దేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరికి తన వాళ్లను అతను కలుసుకున్నాడా? అనేదే ఈ చిత్ర సారాంశం.

విశ్లేషణ
"అవసరం లేనివి కొంటే.. అవసరమైనవి కోల్పోతాం"..సినిమాలో వచ్చే ఈ ఒక్క డైలాగ్ కథా వస్తువును కళ్లకు కడుతుంది. ఈ రోజుల్లో పక్కవాళ్లను చూసి మనం కూడా విలాసాల కోసం ఆరాటపడుతూ ఉన్నవి ఎలా పోగొట్టుకుంటున్నామో దర్శకుడు చాలా రియలిస్టిక్‌గా చూపించారు. మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే చిన్న చిన్న గొడవలు, బంధువుల మధ్య వచ్చే పట్టింపులు, డబ్బు చుట్టూ తిరిగే బతుకులను హృద్యంగా చూపించారు. సెల్వం అప్పు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చూస్తుంటే సగటు మనిషి పడే ఆరాటం కనిపిస్తుంది. సెకండాఫ్‌లోనే అసలు ఎమోషన్ మొదలవుతుంది. బతుకుదెరువు కోసం భార్యాపిల్లలను వదిలి దుబాయ్ వంటి దేశాలకు వెళ్లే వారి కష్టాలను ఇందులో కన్నీళ్లు వచ్చేలా చూపించారు. విదేశాల్లో ఉండి ఇంటి జ్ఞాపకాలతో కుమిలిపోయే వాళ్లు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు.
నటీనటుల ప్రతిభ
సముద్రఖని సెల్వం పాత్రలో ఆయన జీవించేశారని చెప్పాలి. ఒక తండ్రిగా, బాధ్యతగల భర్తగా ఆయన నటన అద్భుతం. లక్ష్మీ ప్రియా మధ్యతరగతి ఇల్లాలుగా, తన భర్త పడే కష్టాన్ని చూసి తల్లడిల్లే భార్యగా అద్భుతమైన నటన కనబరిచారు.గౌతమ్ మీనన్ తన హుందాతనంతో పాత్రకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులైన అభినయ, కార్తీక్ కుమార్ తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్:
మన ఇంటి కథలా అనిపించే రియలిస్టిక్ డ్రామానే ఈ 'కార్మేని సెల్వం' సినిమా కథాంశం. ఈ సినిమాలో సముద్రఖని, లక్ష్మీ ప్రియల నటన ఎంతో అద్భుతంగా, మధ్యతరగతి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ చిత్రంలో గుండెను హత్తుకునే సంభాషణలు, క్లైమాక్స్ సందేశం అదిరిపోయాయి. నేపథ్య సంగీతం ఎమోషనల్ సీన్లను ఎలివేట్ చేసింది.
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం తక్కువగా ఉండటంతో పాతకాలపు కథలా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. ఇవి మినహాయించి కథకు ప్రాధాన్యం ఇచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు.
తుది తీర్పు
'కార్మేని సెల్వం' కేవలం ఒక సినిమా కాదు.. ఇది ప్రతి మధ్యతరగతి మనిషి ఎదుర్కొనే సంఘర్షణ. కుటుంబ విలువల కంటే డబ్బు ముఖ్యం కాదని చెప్పే ఓ గొప్ప సందేశం. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి చూడాల్సిన ఒక మంచి ఎమోషనల్ డ్రామా ఇది.
*రేటింగ్: 3/5












Click it and Unblock the Notifications