గానకోకిల ఎస్.జానకి మగ గొంతుతో పాడిన పాటలు ఇవే..?
లెజెండరీ సింగర్, ఎస్ జానకి మరణం సంగీత అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. శనివారం సాయంత్రం మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 88 సంవత్సరాలు. కణియర హుండి గ్రామంలోని ఫామ్ హౌస్‌లో 5 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
కాగా 1957లో విడుదలైన 'విధియిన్ విలయాడల్' అనే తమిళ చిత్రం ద్వారా ఆమె గాయనిగా పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి పాట 'ఎమ్మెల్యే' (1957) చిత్రంలోని "నీ ఆశ అడియాస పాయెనే మోసమాయెనే". తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు సుమారు 17కు పైగా భారతీయ భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు జానకి. ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ అవార్డులు.. ఏపీ ప్రభుత్వం నుంచి 10కి పైగా నంది అవార్డులు.. కేరళ ప్రభుత్వం నుండి 14 సార్లు.. తమిళనాడు ప్రభుత్వం నుండి 7 సార్లు రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు.

అయితే గాయనిలా మాత్రమే కాకుండా మిమిక్రీతో ప్రత్యేకతను చాటుకున్నారు జానకమ్మ. జానకమ్మ కెరీర్‌లో అత్యంత విలక్షణమైన ప్రయోగం ఆమె 'మగ గొంతు'తో పాడటం. 1970లో వచ్చిన 'సిఐడి రాజు' అనే తెలుగు సినిమాలో "నన్ను చూసి అంతగాన నవ్వుకునేవెందుకు" అనే పాటను ఆమె పూర్తిగా ఒక పురుషుడి గొంతుతో పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. శోభన్ బాబు తెరపై ఒక ముసలి మగవాడి వేషంలో కనిపించే ఈ పాటలో.. జానకి బేస్ వాయిస్‌తో అచ్చం ఒక పురుషుడు పాడినట్లే పాడారు.
అలానే 1989లో విడువైన 'సంసార సంగీతం' చిత్రంలో టి.రాజేందర్‌తో కలిసి ఆయన కుమారుడు సింబు కూడా నటించాడు. ఈ చిత్రానికి సంగీతం కూడా టి.రాజేందర్ అందించగా.. 'ఐ యామ్ ఏ లిటిల్ స్టార్' పాటను కంపోజ్ చేశారు. ఆ పాటలో 'ఐ యామ్ ఏ లిటిల్ స్టార్... ఆవే నేను సూపర్ స్టార్' అంటూ చిన్న పిల్లవాడి గొంతుతో చాలా అందంగా పాడినట్లు వినిపిస్తుంది. సింబు కోసం జానకి తన గొంతును మార్చుకుని చిన్న పిల్లవాడిలా పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక ఎస్ జానకి పూర్తి పేరు శిష్ట్లా జానకి. ఏప్రిల్ 23, 1938 గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్రీరామమూర్తి, శకుంతలమ్మ. భర్త వి. రామ్‌ప్రసాద్ 1992లో మరణించగా.. మురళీకృష్ణ రీసెంట్ గానే మృతిచెందారు.












Click it and Unblock the Notifications