Bank strike: ఈ బ్యాంకులు మాత్రం ఓపెన్! ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్
సెప్టెంబర్ 28 నుంచి వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఉద్యోగ సంఘాల సమ్మె కారణంగా లావాదేవీలు పూర్తిగా స్థంభించే అవకాశం ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కీలక ప్రకటన చేశాయి. కీలకమైన ఆర్థిక పనులేవైనా ఉంటే ఇప్పుడే పూర్తి చేసుకోవాలని ఖాతాదారులను హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా అటు ఎస్బీఐతో పాటు ఇటు బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు తమ కస్టమర్లకు ముందస్తుగానే ఈ హెచ్చరికలు జారీ చేశాయి.
అసలు ఎందుకు ఈ సమ్మె? కారణం ఇదే..
బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులలో ఏకంగా 90 శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రధానంగా ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని, పెన్షన్లను సవరించాలని, డీఏ విధానంలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పెన్షన్ విధానం (NPS) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని (OPS) మళ్లీ అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధనకోసం సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఈ సమ్మె జరగనుంది.

అర్థసంవత్సరం ముగింపు వేళ మరో టెన్షన్
ఈ సమ్మె సరిగ్గా బ్యాంకింగ్ రంగానికి చెందిన హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ వేళే రావడం గమనార్హం. ఇదే సమయంలో సమ్మె జరిగితే ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఖాతాదారుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సమ్మెకు ముందు రానున్న ఆదివారం (సెప్టెంబర్ 27) అంటే రేపు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. నేడు నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా నేడు హలీడే ఉంటుంది. ఆదివారంతో కలుపుకుని ఒకేసారి ఐదు రోజులు బ్యాంకులు మూతపడితే ప్రజలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన కేంద్రం రేపు వర్కింగ్ డే ప్రకటిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది
డిజిటల్ సేవలే దిక్కు.. ఎస్బీఐ విజ్ఞప్తి
సమ్మె కారణంగా శాఖల్లో సేవలు మందగించే అవకాశం ఉన్నందున, కస్టమర్లు ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్లు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లను ఉపయోగించుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. రీజినల్ రూరల్ బ్యాంకులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటుండటంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. అయితే, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండస్ఇండ్ వంటి కొత్త తరం ప్రైవేట్ బ్యాంకులు మాత్రం యథావిధిగా తమ సేవలను కొనసాగించనున్నాయి. సమ్మెను విరమించుకుని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ, సమ్మె దిశగానే అడుగులు పడుతున్నాయి.














Click it and Unblock the Notifications
