18 ఏళ్లకే మిస్ ఇండియా.. 61లోనూ తగ్గని గ్లామర్.. ఆ హీరోయిన్ అందం ఎవర్‌గ్రీన్!
ఒకప్పుడు తమ అందం, అభినయంతో వెండితెరను ఏలిన సినీతారలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నారు. అప్పట్లో యువతను, సినీ ప్రియులను ఉర్రూతలూగించిన తారలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారిలో మీనాక్షి శేషాద్రి ఒకరు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోని అత్యంత ప్రత్యేకమైన చిత్రం "ఆపద్భాంధవుడు" చిత్రంలో నటించిన మీనాక్షి.. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె అందం నేటికీ, 61 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం తగ్గలేదని, అద్భుతమైన ఆకర్షణతో మెరిసిపోతున్నారని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ నటి సన్నీ డియోల్, వినోద్ ఖన్నాలతో కూడా అనేక హిట్స్ అందించారు.
'ఆపద్బాంధవుడు'తో సౌత్ ఎంట్రీ
మీనాక్షి శేషాద్రి ఎక్కువగా బాలీవుడ్‌లో పనిచేసినప్పటికీ, టాలీవుడ్‌లో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆపద్బాంధవుడు' సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి నటించిన ఆమె నటన, ముఖ్యంగా 'ఔరా అమ్మకుచెల్లా' వంటి పాటల్లో ఆమె అందం, అభినయం నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో ఆమె దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. నేటి తరానికి ఆమె గురించి పెద్దగా తెలియకపోయినా, ఒకప్పుడు ఈ అందాల రాశి తన నటన, రూపంతో యువతను మాత్రమే కాదు, స్టార్ హీరోలను కూడా ఫిదా చేసింది. ఆమె తక్కువ సినిమాలు చేసినప్పటికీ, ప్రతీ పాత్రలో తనదైన ముద్ర వేసి మంచి గుర్తింపు పొందారు.

బాలీవుడ్‌లో తిరుగులేని కెరీర్
మీనాక్షి శేషాద్రి బాలీవుడ్‌లో తన కెరీర్ ను అద్భుతంగా నిర్మించుకున్నారు. ఆమె కేవలం 18 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా పోటీని గెలుచుకుని అందాల రాణిగా వెలుగొందారు. 1982లో 'పెయింటర్ బాబు' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసినా, 1983లో సుభాష్ ఘై దర్శకత్వం వహించిన 'హీరో' చిత్రం ఆమెకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె రిషి కపూర్‌తో కలిసి నటించి మెప్పించారు. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు.అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

వినోద్ ఖన్నాతో కలిసి ఆమె నటించిన 'జబ్ కోయీ బాత్ బిగడ్ జాయే' పాట నేటికీ శ్రోతల అభిమానాన్ని చూరగొంటోంది. 1996లో విడుదలైన 'ఘాతక్' ఆమెకు చివరి చిత్రం. సన్నీ డియోల్‌తో కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించి, ఆమె కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలికింది. తన కెరీర్ పీక్‌లో ఉండగానే మీనాక్షి ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుని నటనకు గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం, ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన వయసుకు తగ్గకుండా ఆమె అందాన్ని పదిలపరుచుకోవడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications