నన్ను చంపితే ఇరాన్ ను బూడిద చేయండి: సైన్యానికి ట్రంప్ సంచలన ఆదేశాలు
అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ విషయంపై ఇటీవల ట్రంప్ సైతం స్పందించారు. ఇరాన్ చంపాలని చూస్తున్నవారి లిస్టులో తన పేరు ముందు ఉంటుందని తెలిపారు. ఈ పరిణామాల దృష్ట్యా ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇరాన్ తనను చంపితే ఆ దేశాన్ని నామరూపాల్లేకుండా బూడిద చేయండని అమెరికా సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యూయార్క్ పోస్ట్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్ కు చెందిన లిస్టులో తన పేరు ఏళ్ల క్రితం నుంచి ఉందని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరోసారి వేడెక్కింది.
" ఇరాన్ చంపాలనుకున్నవారి లిస్టులో నా పేరు ఎప్పటినుంచో ఉంది. అందుకే మేము ఇరాన్ తో ఇలా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు ఒకటే మార్గం ఉంది. ఒకవేళ ఇరాన్ నన్ను హతమారిస్తే ఇరాన్ పై కనివినీ ఎరగని రీతిలో బాంబులు వేయండి" అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఏమైనా కొత్త పథకం రచించిందా..? అని అడగ్గా.. దానికి ట్రంప్ స్పందిస్తూ అలాంటిది ఏమీ ఉండకపోవచ్చని.. తనను చంపాలని ఇరాన్ ఏళ్ల నాటి నుంచి ఎదురుచూస్తోందని అన్నారు. ఇరాన్ కు ప్రప్రథమ శత్రువు తానేనని స్పష్టం చేశారు. మీరంతా నన్ను మిస్ అవుతారని తాను అనుకుంటున్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అంకారాలో నాటో సమ్మిట్ పూర్తయిన తర్వాత వెంటనే పలు కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసిన ట్రంప్ ఆ తర్వాత అమెరికాకు పయనమయ్యారు. అటు శ్వేతసౌధం కూడా తమ అధ్యక్షుడి భద్రతే తమకు ప్రాధాన్యం అని స్పష్టం చేసింది. ఇక టర్కీలోని నాటో సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ తనను ఎందుకు చంపాలనుకుంటుందో వివరణ ఇచ్చారు. " వాళ్ల(ఇరాన్) నాయకులు చనిపోయారు. ఆ తర్వాత మరో బృందం వచ్చింది. వాళ్లు కూడా చనిపోయారు. ఆ తర్వాత మరో బ్యాచ్ వచ్చింది. బహుశా వాళ్లు కూడా మృతి చెంది ఉండొచ్చు. ఎవరికి తెలుసు.. అందుకే వాళ్ల నెంబర్ 1 టార్గెట్ నేనే" అని ట్రంప్ స్పష్టం చేశారు. తాను ఇంతకాలం బతికున్నానంటే తాను ఓ రకంగా లక్కీ అని.. కానీ ఇది ఎక్కువ కాలం ఉండదని కుండబద్దలు కొట్టారు ట్రంప్.
ఇక ఇరాన్- అమెరికా మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపైనా ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో సీజ్ ఫైర్ పూర్తిగా ముగిసిందని.. ఇన్నాళ్లు వాళ్ల మాటలు నమ్మి సమయం వృథా చేసుకున్నామని అన్నారు. ఇరాన్ విషయంలో మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే బెటర్ అని తెలిపారు. ఇరాన్ లోని 80 స్థావరాలపై ఇటీవల అమెరికా దాడులు చేసిన క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్లు రాక్షసులు.. విషపూరితమైన మనుషులు.. ఇన్ని రోజులు నాకు కొంత ఆందోళన ఉండేది వారి మీద.. కానీ ఇప్పుడు అది లేదు.. అని తెలిపారు.
మరోవైపు ఇరాన్ మాజీ సీప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో "కిల్ ట్రంప్" అనే నినాదాలు భారీ స్థాయిలో వినిపించాయి. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కూడా లేపేయాలని పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ పరిణామాల మధ్య మున్ముందు పశ్చిమాసియాలో యుద్ధం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications