సనత్ నగర్ టిమ్స్ కు మాజీ సీఎం పేరు, ఇంచార్జ్ డైరెక్టర్ గా ఆయనే!
సనత్ నగర్ టిమ్స్ ఇప్పటికే రెడీ అయ్యింది. రాష్ట్రంలో వైద్య విద్య, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సనత్ నగర్ లో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ కు మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి పేరును ఖరారు చేసింది తెలంగాణా ప్రభుత్వం.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సేవలకు గుర్తింపుగా సనత్ నగర్ టిమ్స్ కు ఆయన పేరు
తెలంగాణ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సేవలకు గుర్తింపుగా సనత్‌నగర్ టిమ్స్‌కు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సనత్ నగర్ టిమ్స్ ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.63 జారీ చేసింది.

మర్రి చెన్నారెడ్డి పేరు సనత్ నగర్ టిమ్స్ కు పెట్టటం సంతోషం: మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు సనత్ నగర్ టిమ్స్ కు పెట్టటం సంతోషంగా ఉందని ఆరోగ్యశాఖమంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఒక వైద్యునిగా, రాజకీయ నాయకునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఆయన జీవితాంతం ప్రజల కోసం పనిచేశారని మంత్రి కొనియాడారు. సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఆయన పనిచేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆయన స్పూర్తితో సనత్‌నగర్ టిమ్స్‌లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు.
టిమ్స్ కు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డా. నరేంద్రకుమార్
అంతేకాదు త్వరలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించనున్న క్రమంలో టిమ్స్ కు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా, ప్రస్తుత మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం డీఎంఈగా ఉన్న డాక్టర్ నరేంద్ర కుమార్ జూలై 31న ఉద్యోగవిరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన సుదీర్ఘపరిపాలనా అనుభవాన్ని సనత్‌నగర్ టిమ్స్‌కు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.టిమ్స్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ జీవో ఎంఎస్ నం.64 జారీచేసింది. ఆగస్టు 1నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
డీఎంఈగా డాక్టర్ వాణి నియామకం
డీఎంఈగా డాక్టర్ వాణిని నియమించింది.ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న అడిషనల్ డీఎంఈ డాక్టర్ ఎన్.వాణిని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నం.318 జారీ చేసింది. వాణికి గతంలోనూ డీఎంఈగా కొంతకాలం పనిచేసిన అనుభవం ఉంది.













Click it and Unblock the Notifications